
ముంబై: మహాత్మా గాంధీ మనవడు, రచయిత అరుణ్ మణిలాల్ గాంధీ మరణించారు. మహారాష్ట్ర కొల్హాపూర్ కొల్హాపూర్ నగరం సమీపంలోని హన్బర్‌వాడిలో ఉన్న అవని సంస్థలో బస చేస్తున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అరుణ్ గాంధీ గత 24 సంవత్సరాలుగా అనురాధ భోసలే నిర్వహిస్తున్న అవని సంస్థకు వస్తుండేవారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న కొల్హాపూర్‌కు వచ్చిన అరుణ్‌గాంధీ.. అక్కడ పదిరోజుల పాటు బస చేయాలని అనుకున్నారు.
అయితే అక్కడి నుంచి బయలుదేరే ముందు అరుణ్ గాంధీ అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వా త ప్రయాణాలు చేయవద్దని వైద్యులు సూచించడంతో ఆయనే అక్కడ ఉండిపోయారు. అయితే ఈరోజు ఉదయం అరుణ్ గాంధీ తుదిశ్వాస విడిచినట్టుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
1934 ఏప్రిల్ 14 న డర్బన్‌లో మణిలాల్ గాంధీ , సుశీలా మష్రువాలా దంపతులకు అరుణ్ గాంధీ జన్మించారు. అరుణ్ గాంధీ సామాజిక కార్యకర్తగా తన తాత మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచారు. రచయితగా, సామాజిక కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు. ఇక, అరుణ్ గాంధీ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం కొల్హాపూర్ జిల్లాలోని వాషి నంద్వాల్‌లో నిర్వహించనున్నట్టుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అరుణ్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ కొల్హాపూర్‌కు బయలుదేరారు.