
బీహార్‌లో ముజఫర్‌పూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు బాలికలు సజీవ దహనమయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. వివరాలు.. ముజఫర్‌పూర్‌లోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేష్‌రామ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్న గుడిసెలో మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు పక్కనే ఉన్న మరో రెండు, మూడు గుడిసెలకు కూడా వ్యాపించాయి. దీంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించింది. చాలాసేపు శ్రమించిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే అప్పటికే భారీ నష్టం జరిపోయింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో నరేష్ రామ్‌కు చెందిన నలుగురు కుమార్తెలు కాలి బూడిదయ్యారు. మృతులను సోని కుమారి (12), శివాని కుమారి (8), అమృత కుమారి (5), రీటా కుమారి (3) లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి కాలిన గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సదర్ పోలీస్‌స్టేషన్ పోలీసులు చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో నలుగురు చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ ప్రమాదంలో గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలిసింది. వారు ప్రస్తుతం జిల్లాలోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో నరేష్ రామ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.