Republic day 2022: ముగింపు కార్యక్రమంలో మహాత్ముడికి ఇష్టమైన పాట తొలగింపు

By Mahesh KFirst Published Jan 22, 2022, 6:13 PM IST
Highlights

గణతంత్ర దినోత్సవ వేడుకలు కొన్ని రోజుల నుంచి చర్చలోనే ఉన్నాయి. ముఖ్యంగా శకటాల వివాదంతో ఎక్కువ కాలం అటు కేంద్రం, ఇటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో చర్చ జరిగింది. తాజాగా, కేంద్రం తీసుకున్న మరో నిర్ణయం చర్చనీయాంశం అవుతున్నది. రిపబ్లిక్ డే బీటింగ్ రీట్రీట్ కార్యక్రమంలో మహాత్మా గాంధీకి ఇష్టమైన పాటను కేంద్రం తొలగించింది. ఈ బీటింగ్ రీట్రీట్ కోసం ఎంపిక చేసిన 26 పాటల్లో ‘అబైడ్ విత్ మీ’ లేదు. గతేడాది కూడా ఈ పాటను తొలగించింది. కానీ, వ్యతిరేకత రావడంతో మళ్లీ చేర్చింది.

న్యూఢిల్లీ: ఈ ఏడాది గణతంత్ర వేడుకల(Republic Day Celebrations)ను ఘనంగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తున్నది. ఈ వేడుకలకు సంబంధించి కొన్ని అంశాలు వివాదాస్పదం అవుతున్నాయి. శకటాల వివాదం నిన్నా మొన్నటి వరకు జరిగిన సంగతి తెలిసిందే. నేతాజీ థీమ్‌తో రూపొందించిన పశ్చిమ బెంగాల్ శకటాన్ని రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంపిక చేయకపోవడంపై ఆ రాష్ట్ర సీఎం అసహనం వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం కూడా శకటాల వివాదంపైనే ప్రధానికి ఓ లేఖ రాశారు. తాజాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం చర్చనీయాంశం అవుతున్నది. గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంగా నిర్వహించే బీటింగ్ రీట్రీట్‌(Beating Retreat)లో మహాత్ముడి(Mahatma Gandhi)కి ఎంతో ఇష్టమైన పాట ‘అబైడ్ విత్ మీ’(Abide With Me) ను కేంద్ర ప్రభుత్వం తొలగించింది.

అబైడ్ విత్ మీ అనేది ఒక క్రిస్టియన్ కీర్తన. ఈ ప్రేయర్‌ను స్కాటిష్ ఆంగ్లికన్ హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ 1847లో రాశారు. దీనికి విలియం హెన్రీ మాంక్ స్వరాలు సమకూర్చారు. ఈ పాట మహాత్మా గాంధీకి అమిత ఇష్టమైనది. ఈ పాటను 1950 నుంచి ప్రతి గణతంత్ర వేడుక బీటింగ్ రీట్రీట్‌లో ప్రదర్శిస్తుంటారు. గతేడాది తొలిసారిగా ఈ పాటను బీటింగ్ రీట్రీట్ నుంచి తొలగించారు. ఈ చర్యపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లీ చేర్చారు. తాజాగా, మరోమారు ఈ పాటను కేంద్రం తొలగించింది.

ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 29వ తేదీన ముగుస్తాయి. ఈ రోజున కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ఎయిర్ ఫోర్స్, ఇతర బలగాలు డ్రమ్స్ బ్యాండ్, సన్నాయిలతో పాటలను ప్రదర్శిస్తుంటారు. సారే జహా సే అచ్చా పాటతో కార్యక్రమం ముగుస్తుంది. బీటింగ్ రీట్రీట్‌ రోజున ప్రదర్శించడానికి కేంద్ర ప్రభుత్వం 26 పాటలను ఎంపిక చేసింది. ఇందులో అబైడ్ విత్ మీ అనే పాట లేదు. దీంతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది.

ప్రతి ఏడాది గణతంత్ర దినోత్స వేడుకలు జనవరి 24వ తేదీన ప్రారంభం అయ్యేవి. కానీ, ఈ ఏడాది జనవరి 23వ తేదీనే ప్రారంభం అవుతున్నాయి. జనవరి 23వ తేదీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఈ ఏడాది ఆయన 125వ జయంతి వేడుకలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన జయంతితోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం అవుతున్నాయి. ఇకపై ప్రతి యేటా జనవరి 23వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం అవుతాయి.

కాగా, గణతంత్ర దినోత్సవ వేడుక(Republic Day Celebrations)ల్లో శకటాల(tableaux) ఎంపికపై కొన్ని రాష్ట్రాలు కేంద్రంపై గుర్రుగా ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్(West Bengal), తమిళనాడు(Tamilnadu) రాష్ట్రాలు.. తాము పంపిని శకటాలను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ విషయమై లేఖలు రాశారు. ఈ దుమారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) ఎంట్రీ ఇచ్చారు. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసి సమాధానాలు ఇచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ థీమ్‌తో పశ్చిమ బెంగాల్ ఒక శకటాన్ని కేంద్రానికి సూచించింది. కానీ, ఆ శకటం గణతంత్ర దినోత్సవాల్లో నిర్వహించే పరేడ్‌కు ఎంపిక కాలేదు.

click me!