మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. తాను డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు చిక్కిన కొన్ని రోజుల తర్వాత ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తనను ట్రాఫిక్ పోలీసులు వేధించారని, తన భవిష్యత్‌ను నాశనం చేశారని ఆరోపిస్తూ ఓ సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ముంబయి: మహారాష్ట్రలోని థానేలో ఓ యువకుడు శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు ఆయన సోషల్ మీడియాలో ఓ సూసైడ్ నోట్ పోస్టు చేశారు. అందులో తన మరణానికి ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు కారణం అని పేర్కొన్నాడు. తాను డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా వారు తనను ఆపారని తెలిపాడు. కేసు పెట్టొద్దని తాను ఎంత చెప్పినా లీగల్ యాక్షన్ తీసుకున్నారని పేర్కొన్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం తయారీ చేస్తున్న తనకు ఈ కేసు ఆటంకంగా మారుతుందని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆ యువకుడు తన సూసైడ్ నోట్‌లో వివరించాడు. పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.
థానేకు చెందిన 24 ఏళ్ల మనీశ్ ఉత్తేకర్ ఆల్కహాల్ మత్తులో డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులను ఆయన కొద్ది సేపు బ్రతిమాలాడు. తాను కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పాడు. తనపై డ్రంక్ అండ్ర డ్రైవింగ్ కింద కేసు పెట్టొద్దని, ఆ కేసు తన భవిష్యత్‌ను నాశనం చేస్తుందని కోరాడు.
కానీ, పోలీసులు తన విజ్ఞప్తిని స్వీకరించలేదని, తనపై లీగల్ యాక్షన్ ప్రారంభించారని మనీశ్ ఉత్తేకర్‌కు తెలిసింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వాగ్లే ఎస్టేట్ ఏరియాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఉత్తేకర్ ఓ సూసైడ్ నోట్ షేర్ చేశాడు. తనను ట్రాఫిక్ పోలీసులు వేధించారని అందులో ఆరోపించాడు.
తనపై లీగల్ యాక్షన్ తీసుకోవడంతో ఉత్తేకర్ మనస్తాపం చెంది ఉంటాడని పోలీసులు శనివారం తెలిపారు. కానీ, పోలీసులు వేధించడం వల్లే ఉత్తేకర్ మరణించాడన్న ఆయన సూసైడ్ నోట్‌లోని ఆరోపణలను తిరస్కరించారు. సూసైడ్ నోట్‌లో థానేలోని కోప్రి ట్రాఫిక్ యూనిట్‌లో పని చేస్తున్న పుష్పక్, సుధాకర్‌లు తన చావుకు కారణం అంటూ ఆరోపించాడు. అయితే, కోప్రి యూనిట్‌లో ఆ పేర్లతో పోలీసులు ఎవరూ లేరని డీసీపీ వినయ్ రాథోడ్ తెలిపారు.
Also Read; మరో రెండు నెలల్లో భారత్ జోడో రెండో విడత యాత్ర.. గుజరాత్ నుంచి త్రిపుర వరకు రాహుల్ గాంధీ మార్చ్ !
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నాన్ కాంపౌండేబుల్ కేసులని, అందులో రాజీకి వచ్చి వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని డీసీపీ వివరించారు. ఆ కేసులపై కచ్చితంగా కోర్టు లో విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, ఉత్తేకర్ మరణంపై శ్రీనగర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. యాక్సిడెంట్ డెత్ కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు.