నిర్లక్ష్యం.. ఆటోలో గర్భిణీ ప్రసవం.. వైద్య సిబ్బంది షో-కాజ్ నోటీసులు

By Rajesh KarampooriFirst Published Jun 6, 2023, 1:09 AM IST
Highlights

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ నిండు గర్భిణీ హాస్పిటల్ ఆవరణలో ఆటోలోనే ఓ మహిళ ప్రసవించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి అధికారులు షో-కాజ్ నోటీసులు పంపారు. నవజాత శిశువు తదుపరి చికిత్స కోసం మరొక ఆస్పత్రికి తరలించారు. 

ఒక్కోసారి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యుల నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదికి వస్తుంది. అపుడప్పుడూ ప్రాణాలు కూడా కోల్పోవల్సి వస్తుంది. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘటన ప్రభుత్వ ఆస్పత్రుల నమ్మకం పోయేలా చేస్తోంది. అక్కడి సిబ్బంది నిర్లక్ష్యాన్ని బయట పెట్టింది. ప్రసవం కోసం వచ్చిన ఓ నిండు గర్భిణీని వైద్యులు పట్టించుకోకపోవడంతో ఆటోలోనే ప్రసవించింది. 

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన  ఓ నిండు గర్బిణీ ప్రసవం కోసం ఆటోలో వస్మత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆ మహిళకు అప్పటికీ పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి.  కానీ.. ఆస్పత్రి సిబ్బంది అందుబాటులో లేరు. ఆవరణలో జరుగుతున్న ఓ  కార్యక్రమంలో సిబ్బంది బిజీగా ఉన్నారు. పురిటి నొప్పులతో ఆ మహిళ ఎలా అర్ధించిన లాభం లేకుండా పోయింది. దీంతో ఆ మహిళ ఆస్పత్రి గేటు వద్దే ఆటోలో ప్రసవించింది. ఒక మహిళా అటెండర్ తప్ప మరె ఇతర సిబ్బంది ఆ గర్భిణీ పక్కన ఎవరూ లేరు. 

ఈ ఘటనపై సివిల్ సర్జన్ మంగేష్ తెహరే మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వస్మత్‌లోని ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణీ ఆటోరిక్షాలో ప్రసవించిందని, ఈ ఘటనపై సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు.డ్యూటీ సమయంలో వారు ఏమి చేస్తున్నారో సదరు సిబ్బంది మంగళవారంలోగా సమాధానం చెప్పాలనీ, ఈ విషయాన్ని పరిశీలించడానికి తాను మంగళవారం ఫెసిలిటీని సందర్శిస్తానని తెలిపారు. నవజాత శిశువుకు తదుపరి చికిత్స కోసం మరొక ఆస్పత్రికి  రెఫర్ చేయబడినట్టు తెలిపారు. 

click me!