
Loudspeaker Controversy : మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక్రే రాజేసిన లౌడ్ స్పీకర్లు, మైకుల వివాదం మరింతగా ముదురుతోంది. మసీదులపై మైకులను తొలగించాలనే దానిపై చాలా రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. రాజ్ థాక్రే పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. ఈ రోజు ఆయన ఔరంగాబాద్‌లో భారీ ర్యాలీలో ప్రసంగించబోతున్నారు. ఈ సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధమ్ థాక్రే.. లౌడ్ స్పీకర్ల వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. స్వయంగా ఆయన ఈ వివాదంపై మాట్లాడుతూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొందరు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమే లౌడ్ స్పీకర్ల కొత్త డ్రామాను తెరమీదకు తీసుకువచ్చారని ఆరోపించారు. లౌడ్ స్పీకర్ల వివాదాన్ని తెరమీదకు తీసుకువచ్చిన ఎంఎన్ఎస్ నాయకుడు రాజ్ థాక్రే పేరును ప్రస్తావించకుండానే పరోక్షంగా ఆయనకు చురకలంటించారు.
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో లౌడ్ స్పీకర్లు, మైకులు, హనుమాన్ చాలీసాపై తీవ్ర చర్చ జరుగుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే స్వయంగా ముందుకొచ్చారు. "బాలాసాహెబ్‌కు మీరు ఎలా ద్రోహం చేశారో అప్పుడప్పుడు నా కళ్లతో చూశానని బీజేపీని ఉద్దేశించి థాక్రే అన్నారు. వారు అమాయకులు, నేను అమాయకుడిని కాదు. నేను నీతో చనువుగా ప్రవర్తిస్తున్నానని నువ్వు అంటున్నావు. హిందుత్వం పేరుతో నువ్వు చేస్తున్న పనికి కళ్ళు మూసుకున్నాడు కానీ నేను అలా చేయను" అంటూ ఘాటుగా స్పందించారు. లౌడ్ స్పీకర్ల వివాదాన్ని ముందుకు నడుపుతున్న కొందరు పదే పదే జెండాలు మారుస్తారు.. ఎందుకు అలా చేయాలి? కొన్ని రోజుల క్రితం మరాఠీయేతర వ్యక్తులపై విమర్శలు చేసేవారని, ఇప్పుడు హైందవేతరులను ఎంచుకున్నారంటూ ఎద్దేవా చేశారు. రాజ్ థాక్రే, బీజేపీల పేర్లను ప్రస్తావించకుండానే పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
అందరికీ ఉపాధి, ఉద్యోగాలు కల్పించడం, అందరూ జీవించేట్లు చేయడం.. రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో నడిపించడం ఇవే తమ లక్ష్యాలని సీఎం ఉద్ధవ్ స్పష్టం చేశారు. లౌడ్ స్పీకర్ల విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను ఇచ్చిందని, ఇది అన్ని వర్గాల వారికీ వర్తిస్తుందని సీఎం పేర్కొన్నారు. దీనిని అనవసరంగా తెరమీదకు తెచ్చి రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కాగా, మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించాలనే డిమాండ్‌ను రాజ్ థాకరే ప్రారంభించారు. ఆ తర్వాత ఈ అంశం దేశవ్యాప్తంగా పాకింది. మే 3లోగా మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించకుంటే దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని రాజ్ థాకరే మహారాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారు. అలాగే, మసీదుల ముందు కూడా లౌడ్ స్పీకర్లతో హనుమాన్ చాలీసాను ప్లే చేస్తామని రాజ్ థాక్రే పేర్కొన్నారు. నేడు ఆయన ఔరంగాబాద్‌లో భారీ ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఇందులో తమ భవిష్యత్ వ్యూహాన్ని వెల్లడించనున్నారు.
ఇదిలావుండగా, పాట్నాలోని మహావీర్ ఆలయం మరియు మసీదుల్లో ఇరు వర్గాల వారు.. ఒకరి పూజ కార్యక్రమాలు, వేడుకలను గౌరవించడం ద్వారా మత సామరస్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆలయం మరియు మసీదు కేవలం 50 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఆజాన్ సమయంలో ఆలయంలో లౌడ్ స్పీకర్లను స్విచ్ ఆఫ్ చేస్తారు. మసీదు సైతం ఇదే విధంగా చేస్తూ.. ఒకరికొకరు గౌరవానికి చిహ్నంగా ఆలయ భక్తులను సమానంగా గౌరవించుకుంటున్నారు.