అక్కడ రేపటి నుంచే స్కూల్స్ పునఃప్రారంభం.. పేరెంట్స్ ఏమంటున్నారంటే..

By Sumanth KanukulaFirst Published Jan 23, 2022, 3:18 PM IST
Highlights

మహారాష్ట్రలో (Maharashtra) కరోనా ఉధృతి నేపథ్యంలో మూతబడిన స్కూల్స్ రేపటి (జనవరి 24) నుంచి తెరుచుకోనున్నాయి (Schools Reopening). సోమవారం నుంచి 1-12 తరగతి విద్యార్థులు ప్రత్యక్ష తరగతులను ప్రారంభించనున్నట్టుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. 

మహారాష్ట్రలో (Maharashtra) కరోనా ఉధృతి నేపథ్యంలో మూతబడిన స్కూల్స్ రేపటి (జనవరి 24) నుంచి తెరుచుకోనున్నాయి (Schools Reopening). సోమవారం నుంచి 1-12 తరగతి విద్యార్థులు ప్రత్యక్ష తరగతులను ప్రారంభించనున్నట్టుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. విద్యార్థుల భద్రత కోసం పాఠశాలలు కోవిడ్ ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండేలా చర్యలు చేపడతాయని పాఠశాల విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ తెలిపారు. అయితే కోవిడ్ కేసులు దృష్ట్యా స్కూల్స్ పునఃప్రారంభానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక అధికారులకు ఇవ్వబడింది. దీని ప్రకారం జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులు తీసుకునే నిర్ణయాన్ని బట్టి స్కూల్స్ తిరిగి తెరవబడతాయి.

అయితే మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో మాత్రం రేపటి నుంచి స్కూల్స్ తెరుచుకోవడం లేదు. పుణెలోని పాఠశాలలు ఈ వారం తెరవడం లేదని, వచ్చే వారం సమీక్ష సమావేశం తర్వాత పాఠశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) శనివారం తెలిపారు. మరోవైపు Ahmadnagar జిల్లాలో కూడా స్కూల్స్ తెరవడంపై వచ్చే వారం నిర్ణయం తీసుకోనున్నారు. ముంబై, థానే, నాశిక్‌లలో పాఠశాలలు జనవరి 24 నుండి పునఃప్రారంభం కానున్నాయి. నాగ్‌పూర్‌లో మాత్రం జనవరి 26 నుంచి స్కూల్స్ తెరుచుకోనున్నాయి.

‘రాష్ట్రంలో పాఠశాలలను సురక్షితంగా పునఃప్రారంభించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులు, పీడియాట్రిక్ టాస్క్‌ఫోర్స్ ,విద్యా నిపుణులతో వివరణాత్మక చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. పాఠశాలలను సురక్షితంగా పునఃప్రారంభించడాన్ని అంచనా వేయడానికి, నిర్ణయాలు తీసుకునే అధికారం స్థానిక పరిపాలనకు ఉంది’ అని Varsha Gaikwad గురువారం ట్వీట్ చేశారు. అంతేకాకుండా స్కూల్స్ తిరిగి ప్రారంభించాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నట్టుగా చెప్పారు.

ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో 62 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను జనవరి 24 నుండి పాఠశాలలకు పంపడానికి ఇష్టపడటం లేదని ఒక సర్వే వెల్లడించింది. LocalCircle అనే ఆన్‌లైన్ కమ్యూనిటీ ప్లాట్‌ఫారమ్ ఈ సర్వేను నిర్వహించింది. టైర్ 1, టైర్ 2/3, టైర్ 4 నగరాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ఫలితాలు వెల్లడించింది. ఈ సర్వే మొత్తం 4,976 స్పందనలను స్వీకరించింది. 

ఇక, మహారాష్ట్రలో పాఠశాలలు పునఃప్రారంభం అయిన కూడా.. విద్యార్థులు హాజరు కావడానికి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి. విద్యార్థులు అనారోగ్యంగా ఉంటే పాఠశాలలకు పంపవద్దని తల్లిదండ్రులను వర్షా గైక్వాడ్ అభ్యర్థించారు. ఏదైనా విద్యార్థి లక్షణాలు కనిపిస్తే పాఠశాలల్లో ఐసోలేషన్ సౌకర్యాలు ఉండేలా చూడాలని గతంలో చెప్పారు. 

ఇక, మహారాష్ట్రలో శనివారం కొత్తగా 46,393 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 416 ఓమిక్రాన్ కేసులు ఉన్నాయి. శుక్రవారంతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజా కేసులతో రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 74,66,420కి చేరుకుంది. తాజాగా కరోనాతో 48 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,42,071కి చేరుకుంది. రాష్ట్రంలో మరణాల రేటు 1.9 శాతంగా ఉంది. 

click me!