Maharashtra: ఉద్ధ‌వ్ థాక్రేకు వ్య‌తిరేకం కాదు.. ఎవ‌రికీ వెన్నుపోటు పొడ‌వ‌లేదు: రెబల్ ఎమ్మెల్యే

By Mahesh RajamoniFirst Published Jun 30, 2022, 4:17 PM IST
Highlights

Maharashtra political crisis: తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీతో చర్చలు ప్రారంభించారని,  మహారాష్ట్రలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని  శివసేన రెబ‌ల్ ఎమ్మెల్యే దీప‌క్‌ కేసర్కర్ చెప్పారు. 
 

Maharashtra political crisis: మ‌హారాష్ట్రలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటుకాబోతున్న‌ద‌నే సంకేతాల‌ను రెబ‌ల్ ఎమ్మెల్యేలు పంపారు. ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోష్యారిని ప్ర‌భుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ నేత‌లు క‌లిశారు. ఇక తిరుగుబాటు ఎమ్మెల్యేలు, మంత్రులు వెన్నుపోటు పొడిచార‌నీ, రాజ‌కీయ సంక్షోభాన్ని సృష్టించార‌ని శివ‌సేన ఉద్ధ‌వ్ థాక్రే వ‌ర్గం రెబ‌ల్స్ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. శివ‌సేన నాయ‌కుడు ఉద్ధవ్ ఠాథ్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన త‌ర్వాత‌.. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ..  ఏక్నాథ్ షిండే క్యాంప్ శివ‌సేన‌ పార్టీ అధినేతకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఎన్పీపీల‌తో పొత్తును తెంచుకుంటే ఉద్ధ‌వ్ థాక్రేతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

"నిన్న ముఖ్య‌మంత్రి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు. ఆయనను తొలగించడం మా ఉద్దేశం కాదు కాబట్టి మేము ఎలాంటి వేడుకలకు పాల్పడలేదు. మేము ఇప్పటికీ శివసేనలో ఉన్నాము.. ఉద్ధవ్ థాక్రేను  బాధపెట్టడం మరియు అగౌరవపరచడం మా ఉద్దేశం కాదు" అని దీపక్ కేసర్కర్  గోవాలోని పనాజీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అలాగే, "ఏక్‌నాథ్ షిండే ముంబైకి బయలుదేరారు, ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర అభివృద్ధి కోసమేనని.. మేము ఎవరినీ వెన్నుపోటు పొడిచలేదని, సంజయ్ రౌత్ చేసిన ఇటువంటి ప్రకటనలు ప్రజలలో అసంతృప్తిని కలిగిస్తాయి " అని అన్న‌రు.  తాము థాక్రే కుటుంబానికి వ్య‌తిరేకం కాద‌ని తెలిపారు.  "మేము థాక్రే కుటుంబానికి వ్య‌తిరేకం కాదు.. థాక్రే జీ MVAతో పొత్తును తెంచుకుంటే ఆయనతో మాట్లాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాము, కానీ అతను ఇప్పటికీ వారితోనే ఉన్నాడు. మేము  థాక్రేకు వ్యతిరేకంగా ఎస్సీకి వెళ్లలేదు. థాక్రే జీ పట్ల మాకు ఇప్పటికీ గౌరవం ఉంది" అని రెబ‌ల్ ఎమ్మెల్యే దీప‌క్ కేస‌ర్క‌ర్ అన్నారు. 

తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీతో చర్చలు ప్రారంభించారనీ, రెబ‌ల్స్-బీజేపీ క‌లిసి  మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేసర్కర్ చెప్పారు. "మహారాష్ట్ర  బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార తేదీని నిర్ణయిస్తారు. గ‌వ‌ర్న‌ర్ తో ఇదే విష‌యంపై క‌ల‌వ‌డం జ‌రిగింది. వారితో మా చర్చలు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి.. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము" అని ఆయన చెప్పారు. అలాగే, శుక్ర‌వారం నాడు ప్ర‌మాణస్వీకార కార్యక్ర‌మం ఉంటే.. తాము ముంబ‌యికి తిరిగి వెళ్తామ‌ని చెప్పారు. 

ఇదిలావుండగా, మహారాష్ట్ర చేరుకున్న శివసేన రెబల్ నాయకుడు ఎక్ నాథ్ షింగే.. బీజేపీ నాయకుడు, మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పూర్తి స్థాయిలో చర్చలు జరిపారని తెలిసిందే. మంత్రివర్గాల కేటాయింపుల సంఖ్యపై కూడా నిర్ణయానికి వచ్చారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా అందుతున్న మీడియా నివేదికల ప్రకారం.. గురువారం రాత్రి వరకు మహారాష్ట్రలో బీజేపీ సర్కారు కొలువుదీరనుంది. బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ రాత్రి ఏడు గంటలకు మఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం.  శివసేన రెబల్ నాయకుడు ఎక్ నాథ్ షింగే, దేవేంద్ర ఫడ్నవీస్ లు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన విషయాలపై మాట్లాడటానికి గవర్నర్ దగ్గరకు వెళ్లారని సమాచారం. 

click me!