మరాఠా రాజకీయాల్లో సంచలనం : ఆటోడ్రైవర్ నుంచి సీఎం స్థాయికి..ఎవరీ ఏక్‌నాథ్ షిండే

By Siva KodatiFirst Published Jun 30, 2022, 8:59 PM IST
Highlights

మరాఠా రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఏక్‌నాథ్ షిండే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. శరద్ పవార్ , ఉద్ధవ్ థాక్రే, సంజయ్ రౌత్ వంటి హేమాహేమీల వ్యూహాలను చిత్తు చేసి మరి షిండే సీఎం పీఠాన్ని అధిష్టించారు. 
 

గత కొన్నిరోజులుగా అనూహ్య మలుపులు తిరుగుతోన్న మహారాష్ట్ర రాజకీయం చివరి రోజు కూడా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించింది. ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయడంతో .. రెబల్స్ అండతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా వ్యూహం మార్చిన కమలనాథులు.. సీఎం కుర్చీని ఏక్ నాథ్ షిండేకే (eknath shinde) అప్పగించారు. ఈ ట్విస్ట్ తో రాజకీయ వర్గాల భ్రమలు తొలగిపోయాయి. అయితే ఇప్పుడు మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా ఏక్ నాథ్ షిండే పేరు మారుమోగుతోంది. శివసేనలో (shivsena) తిరుగుబాటుకు సారథ్యం వహించి.. ఉద్ధవ్ సర్కార్ ను (uddhav thackeray) కూల్చేసిన ఆయన ఎట్టకేలకు తన సీఎం కలను నెరవేర్చుకున్నారు. అసలు ఎవరీ ఏక్ నాథ్ షిండే.. ఈ స్థాయికి ఎలా రాగలిగారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. 

ఏక్ నాథ్ షిండే పూర్తి పేరు ఏక్​ నాథ్ శంభాజి షిండే. సతారా జిల్లాలోని జావాలి తాలూకాకు చెందిన వారు.. మరాఠా కమ్యూనిటీలో ఆయన బలమైన నేత. అతని చిన్న తనంలోని షిండే కుటుంబం ముంబై శివార్లలోని థానేకు వలస వెళ్లింది. మంగళ హైస్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో చదువుకున్నారు. ప్రస్తుతం మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వంలో ఆయన పట్టణ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. 

Also REad:Maharashtra Crisis: సీఎంగా ఏక్‌నాథ్ షిండే ఎందుకు? ఐదు కారణాలివే.. బీజేపీ ప్లాన్ ఫలించేనా?

శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్రే, పార్టీ ధానే జిల్లా ఇంఛార్జ్ ఆనంద్ దిఘే ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఏక్ నాథ్ షిండే. 1980లలో సాధారణ కార్యకర్తగా శివసేనలో చేరారు. అప్పట్లో రిక్షా తొక్కుతూ, ఆటో డ్రైవర్ నడుపుతూ జీవనం సాగించేవారు షిండే. 1984లో పార్టీ కిసాన్ నగర్ బ్రాంచ్ హెడ్​ గా ఆయన నియమితులయ్యారు. 1997లో ధాణె మున్సిపల్ కార్పొరేషన్​ కార్పొరేటర్​ గా ఎన్నికయ్యారు. 2004లో థానే నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. 2005లో థానే జిల్లాకు శివసేన అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. 2009లో కొపారి- పంచపఖాడి నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019లలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

షిండే జీవితంలో విషాదం:

ఏక్ నాథ్ షిండే జీవితంలో 2000వ సంవత్సరంలో అత్యంత ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆయన ఇద్దరు కుమారులు దీపేష్ (11), శుభద (7)లు మహారాష్ట్రలోని వారి స్వగ్రామంలోని సరస్సులో బోటింగ్ కు వెళ్లారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ పడవ బోల్తా పడి పిల్లలిద్దరూ నీటిలో మునిగి చనిపోయారు. ఈ దుర్ఘటనతో షిండే కొన్ని నెలల పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆనంద్ డిఘే షిండేకు అండగా నిలిచారు. మనసు అటువైపు వెళ్లకుండా షిండేకు మరో కీలక బాధ్యత అప్పగించారు. ఆయన సంతానంలో డాక్టర్ శ్రీకాంత్ షిండే ఒక్కరే జీవించి వున్నారు. ఆయన ఆర్ధోపెడిక్ సర్జన్ గా పనిచేస్తున్నారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన శ్రీకాంత్.. కళ్యాణ్ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన 2019లో మరోసారి విజయం సాధించారు. 

click me!