maharashtra crisis: మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండే

By Siva KodatiFirst Published Jun 30, 2022, 7:42 PM IST
Highlights

మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ లు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరితో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. 

మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ లు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరితో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా.. అసలు ముఖ్యమంత్రి అవుతారనుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ తాను ప్రభుత్వంలో భాగంగా వుండనని చెప్పడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడిచింది. అయితే ప్రభుత్వంలో భాగం కావాలని, డిప్యూటీ సీఎం పదవి చేపట్టాలని దేవేంద్ర ఫడ్నవీస్ ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోరారు. దీంతో ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించారు.  

అంతకుముందు మహారాష్ట్ర రాజకీయంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ గ్రూప్‌కు నాయకత్వం వహించిన ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మీడియా సమావేశంలో కీలక ప్రకటన చేశారు. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇక, సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామాతో దాదాపు వారం రోజులు సాగిన రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరింది. ఏక్‌నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేల, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యాయి. 

Also Read:maharashtra crisis: జేపీ నడ్డా జోక్యం.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్..?

ఈ క్రమంలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలిసిన ఏక్నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ తమకు ఉందని తెలియజేశారు. అనంతరం దేవేంద్ర ఫెడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దెవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘2019లో  శివసేన పొత్తు పెట్టుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో మాకు అవసరమైన సంఖ్యాబలం వచ్చింది. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించాము. అయితే బాలాసాహెబ్ జీవితాంతం ఎవరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారో వారితో పొత్తు పెట్టుకోవాలని శివసేన నిర్ణయం తీసుకుంది. హిందుత్వ, సావర్కర్‌కు వ్యతిరేకంగా ఉన్న వారితో శివసేన కూటమిని ఏర్పాటు చేసింది. ప్రజల ఆదేశాన్ని శివసేన అవమానించింది’’ అని అన్నారు.

‘‘కాంగ్రెస్, ఎన్‌సీపీలతో పొత్తును ముగించాలని శివసేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే వారి అభిప్రాయాలను విస్మరించారు. మహా వికాస్ అఘాడి కూటమి భాగస్వాములకు ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఈ ఎమ్మెల్యేలు వారి నిరసనను తీవ్రతరం చేశారు’’ అని ఫడ్నవీస్ చెప్పారు. అయితే ఈరోజు రాత్రి 7.30 గంటలకు సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఫడ్నవీస్ చెప్పారు. ఈరోజు మంత్రులు ఎవరూ ప్రమాణ స్వీకారం చేయబోరని చెప్పారు. ఈ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉంటుందని చెప్పారు. తాను ప్రభుత్వంలో భాగం కాబోనని ఫడ్నవీస్ వెల్లడించారు.

click me!