రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో తోపులాట.. మహారాష్ట్ర మాజీ మంత్రి నితిన్ రౌత్‌కు గాయాలు..

By Sumanth Kanukula  |  First Published Nov 2, 2022, 12:11 PM IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో చిన్నపాటి అపశృతిచోటుచేసుకుంది. మంగళవారం రాహుల్ పాదయాత్రలో చిన్నపాటి తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నితిన్ రౌత్‌కు గాయాలు అయ్యాయి.


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో చిన్నపాటి అపశృతిచోటుచేసుకుంది. మంగళవారం రాహుల్ పాదయాత్రలో చిన్నపాటి తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నితిన్ రౌత్‌కు గాయాలు అయ్యాయి. నితిన్ రౌత్ భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న సమయంలో పోలీసులు నెట్టివేయడంతో ఈ ఘటన జరిగినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నితిన్ రౌత్ కుడి కన్ను, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని వాసవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ విషయంపై దీక్ష రౌత్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘నిన్న హైదరాబాద్‌లో మా నాన్న భారత్‌ జోడో యాత్రలో స్పృహ తప్పి పడిపోయారు. అతడి తలపై చిన్న గాయమైంది. ఆయన త్వరగా కోలుకుని మహారాష్ర్టకు భారత్ జోడో యాత్ర చేరుకున్నప్పుడు.. ఆ ప్రజా ఉద్యమంలో చేరతారని ఆశిస్తున్నాను’’ అని దీక్ష రౌత్ ట్వీట్ చేశారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిత్రాలను కూడా షేర్ చేశారు.  

Latest Videos

 

Yesterday, in Hyderabad my father fainted during Bharat jodo yatra. He has got a small injury on his head. I hope he gets well soon and joins the Mass movement when it reaches Maharashtra. pic.twitter.com/X0Su2v1Upd

— Deeksha Nitin Raut (@DeekshaNRaut)


ఇక, రాహుల్ పాదయాత్ర మంగళవారం ఉదయం హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించింది. మంగళవారం సాయంత్రం చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నెక్లెస్ రోడ్డులో జరిగిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించారు. నెక్లెస్‌ రోడ్డులో జరిగి కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో సాగుతున్న రాహుల్ యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. దీంతో పోలీసులు బందోబస్తు కోసం భారీగా సిబ్బందిని మోహరించారు. 

ఇదిలా ఉంటే.. తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎనిమిదో రోజుకు చేరింది. ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర హైదరాబాద్ నగరంలో కొనసాగుతుంది. గత రాత్రి బస చేసిన బోయిన్ పల్లి నుంచి రాహుల్ గాంధీ బుధవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి బాలానగర్, హబీబ్ నగర్, మూసాపేట, ఐడీఎల్ జంక్షన్, కూకట్ పల్లి, మియాపూర్ మీదుగా మదీనగూడ వరకు సాగింది. భోజన విరామం అనంతరం సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ పాదయాత్రను తిరిగి ప్రారంబించనున్నారు. సాయంత్రం రామచంద్రాపురం, పఠాన్ చెరువు మీదుగా రాహుల్ పాదయాత్ర సాగనుంది. పఠాన్ చెరువు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు దాటి ముత్తంగి వరక పాదయాత్ర సాగనుంది. అక్కడ కార్నర్ మీటింగ్‌లో రాహుల్ మాట్లాడతారు. రాత్రికి రుద్రారంలో రాహుల్ గాంధీ బస చేస్తారు. 

click me!