
ముంబై: మహారాష్ట్రలోని ఔరంగబాద్ లో దారుణం చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై నిద్రిస్తుండగానే కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మైనర్ బాలిక ప్రాణాలతో బయటపడింది.
మరణించిన వారిని రాజు నివారే అలియాస్ శంభాజీ, ఆశ్విని నివారే, సాయలి నివారేలుగా గుర్తించారు. పైఠన్ తాలుకాలోని పాతకావసన్ గ్రామంలో ఈ ఘటన శనివారం నాడు చోటు చేసుకొంది.
రాజు తన కుటుంబసభ్యులతో కలిసి ఓ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి నుండి ఆలస్యంగా వచ్చి రాజు నివారే కుటుంబసభ్యులు తమ ఇంట్లో పడుకొన్నారు.
శనివారం తెల్లవారుజామున దుండగులు రాజు నివారే కుటుంబసభ్యులను అత్యంత దారుణంగా హత్య చేశారు. నిద్రలో ఉన్నవారి గొంతులు కోశారు.
ఉదయమైనా రాజు నివారే కుటుంబసభ్యులు బయటకు రాలేదు. తలుపులు తీసి ఉండడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూస్తే రాజు కుటుంబం రక్తం మడుగులో కన్పించింది. రాజు నివారేతో పాటు ఆయన భార్య ఆశ్విని, కూతురు సాయలీలు మరణించారు. ఈ ఘటనలో ఆరేళ్ల సోహమ్ తీవ్ర గాయాలపాలయ్యాడు.
సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనకు పాల్పడిందెవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.