మీ సినిమాలు ఆడనివ్వం, షూటింగ్‌లు జరగనివ్వం: అమితాబ్, అక్షయ్‌లకి కాంగ్రెస్ వార్నింగ్

By Siva KodatiFirst Published Feb 18, 2021, 5:32 PM IST
Highlights

ఒకప్పుడు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు నాటి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్‌లపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ విరుచుకుపడ్డారు.

ఒకప్పుడు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు నాటి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్‌లపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ విరుచుకుపడ్డారు.

ప్రస్తుతం దేశంలో ఇంధన ధరలు చుక్కలను తాకుతున్నా ఏ మాత్రం స్పందించడం లేదని ఆరోపిస్తూ ఇకపై అమితాబ్, అక్షయ్ కుమార్‌ల సినిమాల ప్రదర్శన, షూటింగ్‌‌లను సైతం అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెస్ బెదిరింపుల నేపథ్యంలో బీజేపీ నేతలు వీరికి మద్ధతుగా నిలిచారు. మన్మోహన్ హయాంలో ఇంధన ధరలపై అమితాబ్, అక్షయ్‌లు ట్వీట్‌లు చేసేవారని .. కానీ నేడు నియంత్రత్వ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి వారికి ధైర్యం లేదా అని కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ విమర్శించారు.

రాష్ట్రంలోని పన్నులతో కలుపుకుని మహారాష్ట్రలో కొన్ని చోట్ల పెట్రోల్ ధరలు రూ.100ను దాటాయని ఆయన గుర్తుచేశారు. ఇక నుంచి మహారాష్ట్రలో అమితాబ్, అక్షయ్ కుమార్ చిత్రాల షూటింగ్‌లను తాము అనుమతించమని నానా పటోల్ స్పష్టం చేశారు.

దీనిపై స్పందించిన బీజేపీ నేతలు.. ప్రతిభావంతులైన వ్యక్తులను కాంగ్రెస్‌ బెదిరిస్తోందని మండిపడ్డారు. భారతదేశానికి అనుకూలంగా ట్వీట్ చేయడమా అని బీజేపీ నేత కదమ్ ప్రశ్నించారు.

విదేశాల్లో వున్న కొంతమంది భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని.. వారికి కాంగ్రెస్ మద్ధతుగా నిలుస్తోందని ఆయన ఆరోపించారు. రైతుల ఆందోళనలను సాకుగా చేసుకుని భారతదేశ ఖ్యాతిని దెబ్బతీసేందుకు అంతర్జాతీయంగా కుట్ర జరుగుతున్నట్లు ఢిల్లీ పోలీసులు బయటపెట్టిన టూల్ కిట్ వ్యవహారాన్ని కదమ్ గుర్తుచేశారు.

ప్రముఖ పాప్ సింగర్ రిహానా, సినీ నటి మియా ఖలీఫా, పర్యావరణ హక్కుల కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు రైతులకు మద్ధతుగా ట్వీట్ చేయడంతో ఈ కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై కలగజేసుకున్న సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్ వంటి సెలబ్రెటీలు భారత రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ వారికి గట్టి కౌంటరిచ్చారు. 

click me!