
ముంబయి: మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబయి మహా నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలనే ఎజెండాతోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని సోమవారం అన్నారు.
‘కరోనా మహమ్మారి సమయంలో పెద్ద నోట్ల రద్దు, మణిపూర్ హింస వంటి అంశాలపైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించలేదు. ఇప్పుడు ప్రభుత్వం మూడ్, ఇష్టం కోసమే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారు. మహారాష్ట్ర నుంచి ఈ నగరాన్ని వేరు చేస్తారు’ అని నానా పటోలే అన్నారు.
ఈ నెల 18 నుంచి 22వ తేదీల వరకు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాను కేంద్ర ప్రభుత్వం ఇది వరకు ప్రకటించలేదు. దీంతో అనేక రకాల ఊహాగానాలు వస్తున్నాయి.
‘ముంబయి ఒక విశ్వనగరం, ఆర్థిక రాజధాని. ఇప్పుడు ముంబయిలోని కీలకమైన ఎయిర్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్, డైమండ్ మార్కెట్ వంటి వాటిని ఈ నగరం నుంచి బయటకు తరలించే పని చేస్తున్నారు’ అని పటోలే ఆరోపించారు. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లనూ గుజరాత్‌కు తరలించే కుట్ర చేస్తున్నారని అన్నారు.
Also Read: Chandrababu: టీడీపీ నేతకు అఖిలేశ్ యాదవ్ ఫోన్.. చంద్రబాబు అరెస్టుపై సీరియస్ రియాక్షన్
మహారాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకమైన ఈ కార్యక్రమాలను గత మహా వికాస్ అఘాదీ ప్రభుత్వం అడ్డుకుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం మహా వికాస్ అఘాదీ ప్రభుత్వాన్ని పడగొట్టిందని ఆరోపణలు గుప్పించారు.