
కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు శివసేన (shivsena) అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే (uddhav thackeray) . రాష్ట్రంలోని మహా వికాస్ అఘాడి (maha vikas aghadi) నేతలపై బోగస్ కేసుల కోసం సీబీఐ (cbi), ఈడీలను (ed) కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఫైరయ్యారు. వెంటనే ఈ తరహా విధానాలను నిలిపివేయాలని ఆయన కోరారు. లేనిపక్షంలో తమ ప్రభుత్వం ప్రతీకార చర్యలు తీసుకుంటుందని సీఎం హెచ్చరించారు.
బీజేపీకి (bjp) వ్యతిరేకంగా తాము కూడా నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తే వారు పారిపోయేందుకు చోటు కూడా ఉండదు అంటూ బీకేసీలో ర్యాలీ సందర్భంగా ఉద్దవ్ ఠాక్రే కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. కశ్మీర్‌లో పండిట్లకు భద్రత కల్పించడంలో బీజేపీ విఫలమైందని ఆయన విమర్శించారు. దీనికి బదులు కేంద్ర సర్కారు మహారాష్ట్రలో చిన్న పాటి బీజేపీ నేతలకు రక్షణ కల్పిస్తోందని ఉద్ధవ్ థాక్రే దుయ్యబట్టారు.
అటు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (maharashtra navnirman sena) చీఫ్, తన సోదరుడు రాజ్ థాకరేపైనా (raj thackeray) ఉద్దవ్ థాక్రే పరోక్ష విమర్శలు చేశారు. శాఫ్రాన్ శాలువా ధరించి బాలాసాహెబ్ (బాల్ థాక్రే) అని కొందరు అనుకుంటున్నారని.. అలాంటి వారి మెదళ్లలో మున్నాభాయ్ మాదిరి రసాయనం లోపించిందంటూ సీఎం సెటైర్లు వేశారు. 2019 ఎన్నికల్లో విజయం తర్వాత శివసేన నిర్వహించిన అతిపెద్ద ర్యాలీ ఇదే కావడం గమనార్హం.
ఇకపోతే.. శివసేనను నాశనం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయని, అయితే అవన్నీ విఫలమయ్యాయని ఇటీవల ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శివసేన, భారతీయ జనతా పార్టీల వీడిపోయిన నాటి నుంచి ఇరు పార్టీల మధ్య నిత్యం ఏదోక వివాదం నడుస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీల పొత్తు తర్వాత బీజేపీ.. ఏదోక విధంగా ఉద్ధవ్ ఠాక్రేపై దాడులు చేస్తునే ఉంది. మహారాష్ట్రలో మసీదు వద్ద లౌడ్‌స్పీకర్ ఫైట్ జరుగుతున్న నేపథ్యంలో.. శివసేన కూడా హిందూత్వ సహా ఇతర అంశాలపై బీజేపీని చుట్టుముట్టింది. ప్రస్తుతం, రాష్ట్రంలో కొనసాగుతున్న లౌడ్ స్పీకర్ వివాదంపై బిజెపి, శివసేన కూడా ముఖాముఖిగా పోటీ పడుతున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో బీజేపీ నేతలు ఎక్కడ ఉన్నారని ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు.