మహా సంక్షోభంలో కొత్త ట్విస్ట్.. అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన సీఎం ఉద్ధవ్ థాక్రే

By Siva KodatiFirst Published Jun 22, 2022, 10:13 PM IST
Highlights

మహారాష్ట్ర రాజకీయాలు గంట గంటకూ మారిపోతున్నాయి. తాజాగా సీఎం అధికారిక నివాసం వర్షను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఖాళీ చేశారు. అక్కడి నుంచి తన సొంత నివాసం మాతోశ్రీకి ఆయన బయల్దేరారు. అటు తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే గూటికి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి చేరారు. 

మహారాష్ట్ర రాజకీయాలు గంట గంటకూ మారిపోతున్నాయి. తాజాగా సీఎం అధికారిక నివాసం వర్షను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఖాళీ చేశారు. అక్కడి నుంచి తన సొంత నివాసం మాతోశ్రీకి ఆయన బయల్దేరారు. అటు తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే గూటికి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి చేరారు. 

అంతకుముందు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాష్ట్ర (Uddhav Thackeray) ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సొంత ఎమ్మెల్యేలు తనను వద్దనడం బాధగా వుందని ఉద్ధవ్ థాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖ సిద్ధంగా వుందన్నారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా .. ఎన్నికలకు వెళ్లి మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. శివసేన చీఫ్‌గా కూడా దిగిపోవడానికి సిద్ధంగా వున్నానని.. తాను చేసిన తప్పేంటో రెబల్ ఎమ్మెల్యేలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

సీఎం నివాస గృహం వర్షను ఖాళీ చేసేందుకు కూడా సిద్ధంగా వున్నానని.. అలాగే రెబల్స్, ఏక్‌నాథ్ షిండే‌ను (eknath shinde) చర్చలకు ఆహ్వానించారు ఉద్ధవ్ థాక్రే. తాను నమ్మక ద్రోహానికి గురయ్యానని.. తనతో ఏక్‌నాథ్ నేరుగా మాట్లాడాలని సీఎం స్పష్టం చేశారు. శివసేన సైనికుడు ఎవరైనా సీఎం కావొచ్చని థాక్రే తెలిపారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా లేనని ఆయన అన్నారు. 

తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని ఆయన  తెలిపారు. అయితే లక్షణాలు ఏమీ కనిపించడం లేదన్నారు. ఇప్పుడు ఉత్పన్నమైన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని ఉద్ధవ్ థాక్రే తెలిపారు. హిందూమతం, శివసేన ఎప్పుడూ కలిసే వుంటాయని.. శివసేన హిందుత్వానికి కట్టుబడి వుంటుందని సీఎం అన్నారు. దేశంలో టాప్ 5 సీఎంలలో తాను కూడా ఒకడినని .. బాల్‌థాక్రే వారసత్వాన్ని కొనసాగించేది తామేనని ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. 

కరోనా వల్ల ప్రజలను కలవలేకపోతున్నానని ఆయన తెలిపారు. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటామని ఉద్థవ్ థాక్రే స్పష్టం చేశారు. హిందుత్వాన్ని శివసేన ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని సీఎం పేర్కొన్నారు. తాను ప్రజల్ని కలవడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 30 ఏళ్లుగా తాము కాంగ్రెస్, ఎన్సీపీలను వ్యతిరేకించామని ఉద్ధవ్ గుర్తుచేశారు. కానీ శరద్ పవార్ .. నన్నే సీఎంగా బాధ్యతలు స్వీకరించాలని కోరారని ఆయన చెప్పారు. అలాంటి పరిస్ధితుల్లో ఛాలెంజింగ్‌గా బాధ్యతలు స్వీకరించానని.. ఎన్సీపీ, కాంగ్రెస్ తనకు పూర్తి సహకారం అందించాయని థాక్రే తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ , ఎన్సీపీ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని.. రెబల్ ఎమ్మెల్యేలు కోరితే తప్పుకుంటానని ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. 
 

click me!