సాగు చట్టాల్లాగే.. ‘అగ్నిపథ్‌’ను కూడా మోడీ వెనక్కి తీసుకోవాల్సిందే.. ఆర్మీని బలహీనపరుస్తున్నారు: రాహుల్ గాంధీ

By Mahesh KFirst Published Jun 22, 2022, 7:54 PM IST
Highlights

అగ్నిపథ్ స్కీంను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. సాగు చట్టాల్లాగే.. ఈ అగ్నిపథ్ స్కీంను కూడా మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందేనని అన్నారు. తాము జాతీయవాదులం అని చెప్పుకునే మోడీ ప్రభుత్వం దేశ భద్రతా బలగాలనే బలహీనపరుస్తున్నదని ఆరోపించారు.

న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్కీం కేంద్రంగా రాహుల్ గాంధీ .. మోడీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. తాము జాతీయవాదులం అని పిలుచుకునే బీజేపీ ప్రభుత్వం.. దేశ భద్రతా బలగాలనే బలహీనం చేస్తున్నదని విమర్శించారు. సాగు చట్టాలను ఉపసంహరించుకున్నట్టే ఈ కొత్త తరహా ఆర్మీ రిక్రూట్‌మెంట్ విధానాన్ని కూడా వెనక్కి తీసుకోవాల్సిందేనని అన్నారు. వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ అని గొప్పలు చెప్పి కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు నో ర్యాంక్ నో పెన్షన్‌ను అమలు చేయడానికి పూనుకుందని విమర్శలు చేశారు.

కాంగ్రెస్ చట్టసభ్యులను, పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఆయన బుధవారం మాట్లాడారు. రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ వీరంతా ధర్నాలకు దిగారు. వీరిని ఉద్దేశిస్తూ.. తనను విచారించడం ముఖ్యమైన విషయం కాదని, ఉద్యోగాల అంశం ముఖ్యమైనదని అన్నారు. ఈ దేశానికి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వెన్నెముక అని తెలిపారు. కానీ, మోడీ ప్రభుత్వం ఆ వెన్నెముకనే విరిచేసిందని చెప్పారు. పొద్దున్నే లేచి ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ కోసం ట్రెయినింగ్ తీసుకునేవారిని ఉద్దేశిస్తూ.. ప్రధాని మోడీ దేశ వెన్నెముకనే విరిచేశారని, కాబట్టి, వారికి దేశం ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. 

ప్రభుత్వం ఏం చేసినా.. అది ఉద్యోగాలు ఇవ్వలేదని తెలిపారు. ఎందుకంటే.. ఈ దేశాన్ని ప్రధాని మోడీ ఇద్దరు ముగ్గురు వ్యాపారవేత్తల చేతిలో పెట్టాడని అన్నారు. వారు యువతకు జాబ్‌లు ఇవ్వరని చెప్పారు. ఇప్పుడు వారు కనీసం ఆర్మీలోకి చేరడానికి ద్వారాలు మూసేస్తున్నారని తెలిపారు. 

భద్రతా బలగాల్లో ఉద్యోగాల కోసం ఉదయమే ట్రెయినింగ్ చేసి ఇంటికి వెళ్తారని, కానీ, అగ్నిపథ్ ద్వారా ఆర్మీలో నాలుగేళ్ల తర్వాత ఏ ఉద్యోగం ఉండదని, దానికి తాను గ్యారంటీ అని అన్నారు. 

చైనా ఆర్మీ భారత దేశ భూమిలో కూచుని ఉన్నదని, ఇప్పటికి సుమారు 1000 చదరపు కిలోమీటర్ల భూమిని లాక్కున్నదని తెలిపారు. ఈ నిజాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించిందని చెప్పారు. ఈ సమయంలో ఆర్మీని బలోపేతం చేయాలని, కానీ, అందుకు బదులు దాన్ని బలహీన పరుస్తున్నదని కేంద్రంపై ఆరోపణలు చేశారు. 

తాను సాగు చట్టాల గురించి కూడా చెప్పాడని, వాటిని వెనక్కి తీసుకోవాల్సిందేనని చెబితే.. మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోకతప్పలేదని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు తాను అగ్నిపథ్ స్కీంను కూడా ఉపసంహరించుకోవాల్సిందేనని అంటున్నారని, ఈ విషయంలో దేశ యువత కూడా తమతోపాటే ఉన్నారని చెప్పారు.  కేంద్ర ప్రభుత్వం ఈ స్కీంను కూడా వెనక్కి తీసుకుంటుందని తెలిపారు.

click me!