‘ఏక్ నాథ్ షిండేతో మాట్లాడుతున్నాం.. ఎమ్మెల్యేలు తిరిగొస్తారు’... సంజయ్ రౌత్

Published : Jun 21, 2022, 01:18 PM IST
‘ఏక్ నాథ్ షిండేతో మాట్లాడుతున్నాం.. ఎమ్మెల్యేలు తిరిగొస్తారు’... సంజయ్ రౌత్

సారాంశం

ఏక్ నాథ్ షిండేతో సంప్రదింపులు జరుపుతున్నాం. కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడాం. ఆయన త్వరలోనే ఎమ్మెల్యేలతో తిరిగి వస్తారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. 

ముంబయి : మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే,  తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లడం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కుదిపేసింది. షిండే తన మద్దతుదారులతో కలిసి బిజెపిలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న వేళ.. శివసేన పార్టీ రంగంలోకి దిగింది. షిండేను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అటు తాజా పరిణామాలపై పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. షిండే తమ పార్టీకి నమ్మకమైన వ్యక్తి అని, త్వరలోనే తమ ఎమ్మెల్యేలు తిరిగి వస్తారని అన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమిని కూల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని విశ్వాసం వ్యక్తం చేశారు.

‘నిన్న రాత్రి శాసనమండలి ఎన్నికల తర్వాత నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో లేరు అనేది నిజమే. ఏక్ నాథ్  షిండే ప్రస్తుతం ముంబైలో లేరు. అయితే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నాం.  కొంతమంది ఎమ్మెల్యేలతో నేను మాట్లాడుతున్నాను. త్వరలోనే మా ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారు. షిండేను ఉపయోగించుకుని  రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేయాలని కొంతమంది చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. ఆయన పార్టీకి నమ్మకమైన నేత. బాలా సాహెబ్ సైనికుడు’  అని రౌత్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ పై రౌత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలలో కొంతమంది తిరిగి రావాలని కోరుకుంటున్నారని అయితే వారిని బలవంతంగా అక్కడ నిర్బంధించారని ఆరోపించారు.

ఇబ్బందుల్లో ఉద్దవ్ ఠాక్రే సర్కార్.. మంత్రి ఏక్‌నాథ్‌తో పాటు 11 మంది శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు!

పెరుగుతున్న తిరుగుబాటు నేతల సంఖ్య..
మరోవైపు ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమైన ఎమ్మెల్యేల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతోంది. మొదట షిండే మరో 11 మంది ఎమ్మెల్యేలు  గుజరాత్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మరింతమంది షిండే వర్గంలో చేరుతున్నట్లు  కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు 21 మంది శివసేన ఎమ్మెల్యేలు రెబల్ గా మారినట్లు తెలుస్తోంది. వీరంతా బీజేపీతో టచ్లో ఉన్నట్లు సమాచారం.

ఠాక్రేతో భేటీ కానున్న పవార్…
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపి పార్టీలు అత్యవసర భేటీలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే పలువురు Ncp సీనియర్ నేతలు అధినేత శరద్ పవార్ ను కలిసేందుకు ఢిల్లీ బయలుదేరారు. అటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత  దేవేంద్ర ఫడ్నవిస్ కూడా హస్తినకు వెళ్లారు.  ఈ సాయంత్రం sharad pawar ముంబైకి తిరిగి వచ్చి సీఎం ఠాక్రేను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వానికి భారీ షాక్​ తగిలింది. శివసేన కీలక నేత, రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే.. సీఎం ఉద్దవ్ ఠాక్రేకు షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏక్‌నాథ్ షిండే 11 మంది పార్టీ ఎమ్మెల్యేలతో గుజరాత్‌లోని సూరత్‌లోని ఓ హోటల్‌కు వెళ్లినట్టుగా సమాచారం. వీరంతా శివసేనపై తిరుగుబావుట ఎగరవేసేందుకు సిద్దమైనట్టుగా తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండే‌తో పాటు సూరత్ వెళ్లిన ఎమ్మెల్యేలు.. బీజేపీ గుజరాత్​ అధ్యక్షుడు సీఆర్​ పాటిల్​తో టచ్​లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక, తన వెంట 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా ఏక్‌నాథ్ షిండే చెబుతున్నారు.
 

 

PREV
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?