ప్రయాగరాజ్‌కు వచ్చే భక్తులు, గత కుంభమేళాలను చూసిన స్థానికులు, పూజారులు యోగి హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి "అద్భుతం" అని అంటున్నారు. ఈ ఊహించని మార్పులకు సీఎం యోగి పరిపాలన కారణమని వారు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రయాగరాజ్ ను మహా కుంభమేళా కోసం రెడీ చేస్తోంది. దేశ నలుమూలల నుండే కాదు విదేశాల నుండి కూడా భక్తులు, పర్యాటకులు భారీ సంఖ్యలో కుంభమేళాలో పాల్గొనే అవకాశం వుంది... ఈ నేపథ్యంలోని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఈ కుంభమేళాను అత్యంత వైభవంగా, మునుపెన్నడూ జరగని విధంగా నిర్వహించేందుకు యోగి సర్కార్ సిద్దమయ్యింది.
ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమానికి సన్నాహకంగా వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి, లక్షలాది మంది యాత్రికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త మౌలిక సదుపాయాలు, సౌకర్యాలతో ప్రయాగరాజ్ రూపాన్ని మారుస్తున్నారు. ఇప్పటికే ప్రయాగరాజ్‌కు చేరుకున్న భక్తులు, గతంలో జరిగిన కుంభమేళాలను చూసిన స్థానికులు, పూజారులు ఈ అభివృద్ధి పనులను చూసి "అద్భుతం" అని నోరెళ్లబెడుతున్నారు. ఈ మార్పులకు సీఎం యోగి పరిపాలనే కారణమని వారు చెబుతున్నారు.
గత ప్రభుత్వాలు ఈ కుంభమేళాకు ఏర్పాట్లు చేయడంలో, మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యాయని ఈ ఏర్పాట్లను చూస్తే అర్థమవుతోందని భక్తులు అంటున్నారు. ఇంతటి విస్తృతమైన ప్రయత్నాలు గతంలో ఎన్నడూ జరగలేవట. ఈ కుంభమేళా ఆధునికత, ఆద్యాత్మికత మేళవింపుగా వారు అభివర్ణిస్తున్నారు.
'రిలిజియస్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆఫ్ ప్రయాగరాజ్' గ్రంథకర్త అనుపమ్ పరిహార్ తన పుస్తకంలో యోగి ప్రభుత్వం తీసుకున్న కీలకమైన చారిత్రక నిర్ణయాలను హైలైట్ చేశారు. మునుపటి ప్రభుత్వాల ఉదాసీనత కారణంగా ప్రయాగరాజ్‌లోని సాంప్రదాయ ద్వాదశ మాధవ పరిక్రమ 1991 నుండి ఆగిపోయిందని ఆయన వివరించారు. అయితే అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు, దివంగత మహంత్ నరేంద్ర గిరి, ప్రధాన కార్యదర్శి మహంత్ హరి గిరిల చొరవతో సీఎం యోగి ఈ ముఖ్యమైన యాత్రా సంప్రదాయాన్ని ఫిబ్రవరి 6, 2019 లో పునరుద్ధరించారని తెలిపారు.తద్వారా స్థానిక పూజారులు, సాధువులకు, దేశ విదేశాల నుండి వచ్చే యాత్రికులకు ప్రయోజనం చేకూర్చిందన్నారు.
మహా కుంభమేళా 2025కి మరింత సన్నద్ధం కావడానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రయాగరాజ్‌లోని మతపరమైన ప్రదేశాలను మెరుగుపరచడానికి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించింది. అక్షయవట్, సరస్వతీ కూప్, పాతాళపురి, బడే హనుమాన్ మందిర్, ద్వాదశ మాధవ మందిర్, భరద్వాజ ఆశ్రమం, నాగ్వాసుకి మందిర్, శృంగవేర్పూర్ ధామ్ వంటి ప్రధాన దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు విస్తృత నిధులతో పునరుద్ధరించబడుతున్నాయి.
ప్రయాగరాజ్ యొక్క ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించడం, రాబోయే మహాకుంభంలో భక్తుల కోసం ఈ పవిత్ర ప్రదేశాల మతపరమైన, సాంస్కృతిక ఆకర్షణను పెంచడం యోగి ప్రభుత్వ విస్తృత దృష్టిలో భాగం.