అక్రమాస్తుల కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడికి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. మంత్రితో పాటు ఆయన భార్యకు కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానాను విధించింది.
చెన్నై: తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడితో పాటు ఆయన భార్య విశాలక్ష్మికి మద్రాస్ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 50 లక్షల జరిమానాను విధించింది. అక్రమాస్తుల కేసులో మద్రాస్ హైకోర్టు ఈ తీర్పును గురువారం నాడు వెల్లడించింది.
ఈ కేసులో సుప్రీంకోర్టులో సవాల్ చేసుకొనేందుకు 30 రోజుల గడువును ఇచ్చింది న్యాయస్థానం. అవినితి నిరోధక చట్టం కింద నేరాలకు పాల్పడ్డారని పేర్కొంటూ మంగళవారంనాడు మంత్రితో పాటు ఆయన భార్యను నిర్ధోషులుగా చేసిన తీర్పును కోర్టు పక్కన పెట్టింది. ఇవాళ కోర్టుకు హాజరు కావాలని కూడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ తీర్పు నేపథ్యంలో 1951 ప్రజా ప్రాతినిథ్యం చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం పొన్ముడి ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు పడనుంది.2006 నుండి 2010 మధ్య కాలంలో పొన్ముడి గనులు, ఖనిజ శాఖ మంత్రిగా పనిచేశారు.ఈ సమయంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
మంత్రి పొన్ముడితో పాటు ఆయన భార్య తమ ఆదాయం కంటే 65.99 శాతం ఎక్కువ ఆస్తులను సంపాదించారని ఆరోపణలను ఎదుర్కొన్నారు.ఈ ఆస్తులకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వలేకపోయారు.తమిళనాడు రాష్ట్రం వర్సెస్ సురేష్ రాజన్ పై సుప్రీంకోర్టు నిర్ధేశించిన ఆదేశాలను ట్రయల్ కోర్టు ఇష్టానుసారంగా కొట్టివేసిందని కోర్టు అభిప్రాయపడింది. ట్రయల్ కోర్టు కేవలం వారి ఆదాయం, ఆస్తులను అంచనా వేయడానికి దాఖలు చేసిన పన్ను రిటర్న్ లపై ఆధారపడినట్టు గమనించిన విషయాన్ని హైకోర్టు తెలిపింది.
పొన్ముడి దంపతులపై అన్నాడిఎంకె ప్రభుత్వ హయంలో విచారణ జరిగింది. 2023 జూన్ 28న ట్రయల్ కోర్టు మంత్రి పొన్ముడిని నిర్ధోషిగా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి విల్పురం జిల్లా అవినీతి నిరోధక శాఖ ఎస్పీ కన్నియప్పన్ విచారణ చేపట్టారు. అవినీతి నిరోధక శాఖ ఈ కేసులో చార్జీషీట్ దాఖలు చేసింది. ఈ విషయమై వందలాది మందిని విచారించింది.
ఈ కేసులో తొలుత విల్లుపురం ప్రధాన క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది. అయితే ఆ తర్వాత దాన్ని 2015 లో విల్లుపురం అవినీతి నిరోధక ప్రత్యేక కోర్టుగా మారింది. 2022లో ఈ కేసు వేలూరు జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టుకు బదిలీ అయింది. ఈ తీర్పు పొన్ముడికి ఎదురు దెబ్బ అని డీఎంకె నేతలు చెబుతున్నారు. అయితే ఈ విషయమై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని డీఎంకె నేతలు చెబుతున్నారు.