భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. జేఎన్. 1 వైరస్ కేసులు పలు రాష్ట్రాల్లో నమోదౌతున్నాయి.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా జేఎన్.1 వైరస్ కేసులు కొత్తగా 21 నమోదయ్యాయి. గోవా, కేరళ,మహారాష్ట్రల్లో కొత్త కరోనా వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
గోవా రాష్ట్రంలో ఇప్పటికే 19 జేఎన్. 1 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళ,మహారాష్ట్రల్లో కొత్తగా ఒక్కో కేసులు రికార్డైనట్టుగా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
కరోనా ఒమిక్రాన్ చెందిన వైరస్ వారసుడిగా జేఎన్.1 వైరస్ దేశంలో పలు నగరాల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది.
జేఎన్. 1 కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక అంశాలను మంగళవారంనాడు ప్రకటించింది. ఈ వైరస్ కారణంగా తక్కువ ప్రజారోగ్యానికి ముప్పు కలుగుతుందని తెలిపింది.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భయపడాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ అభిప్రాయపడ్డారు.
కరోనా కొత్త వేరియంట్ ను భారత్ నిశితంగా పరిశీలిస్తుందని డాక్టర్ పాల్ చెప్పారు. అయితే కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సంసిద్దంగా ఉండాలని పాల్ సూచించారు. కరోనా పరీక్షలను పెంచడంతో పాటు నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆయన కోరారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. జిల్లాల వారీగా శ్వాసకోశ వ్యాధుల కేసులను అన్ని ఆరోగ్య కేంద్రాల నుండి క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కూడ కేంద్రం కోరింది.
కర్ణాటకలో అప్రమత్తమైన యంత్రాంగం
కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.
కరోనా కేసుల సంఖ్య పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పబ్ లు, రెస్టారెంట్ల యజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది. ఎక్కువ సంఖ్యలో గుమికూడడంతో పాటు టెంపరేచర్ ను చెక్ చేయాలని ప్రభుత్వం సూచించింది. మాస్కులు ధరించాలని కోరింది. అంతే కాకుండా తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని కూడ సూచించింది ప్రభుత్వం.
కరోనా కేసుల నేపథ్యంలో పబ్ లలోకి ఎక్కువ సంఖ్యలోకి అనుమతించడాన్ని నియంత్రించారు. మరో వైపు ప్రతి టేబుల్ ను శానిటైజ్ చేస్తున్నట్టుగా పబ్ నిర్వాహకులు ప్రకటించారు.