పన్నీర్‌సెల్వం కుమారుడికి భారీ షాక్.. ఎంపీగా ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు..

Published : Jul 06, 2023, 04:50 PM IST
పన్నీర్‌సెల్వం కుమారుడికి భారీ షాక్.. ఎంపీగా ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు..

సారాంశం

తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం కుమారుడు రవీంద్రనాథ్‌ కుమార్‌కు భారీ షాక్ తగిలింది. పార్లమెంట్ సభ్యునిగా రవీంద్రనాథ్ కుమార్ ఎన్నికల విజయాన్ని రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.

తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం కుమారుడు రవీంద్రనాథ్‌ కుమార్‌కు భారీ షాక్ తగిలింది. పార్లమెంట్ సభ్యునిగా రవీంద్రనాథ్ కుమార్ ఎన్నికల విజయాన్ని రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. డీఎంకే కార్యకర్త పి మిలానీ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్‌ఎస్ సుందర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆర్డర్‌పై అప్పీల్ చేసుకోవడానికి రవీంద్రనాథ్ కుమార్‌కు న్యాయమూర్తి 30 రోజుల సమయం ఇచ్చారు. దీంతో అప్పటి వరకు తీర్పు అమలును నిలిపివేశారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని తేని లోక్‌సభ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన రవీంద్రనాథ్ విజయం సాధించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్‌ ఇలంగోవన్‌పై రవీంద్రనాథ్ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో తమిళనాడులోని మిగిలిన 38 లోక్‌సభ స్థానాల్లో కూడా అన్నాడీఎంకే అభ్యర్థులు ఓడిపోయారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఏకైక వ్యక్తిగా రవీంద్రనాథ్ నిలిచారు. 

ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆస్తులు, ఆదాయ వనరుల వాస్తవాలను దాచిపెట్టారని ఆరోపిస్తూ డీఎంకే కార్యకర్త పి మిలానీ కోర్టును ఆశ్రయించారు. ఆస్తులు, పెట్టుబడులు, ఆదాయ వనరులు, షేర్లు, ఆర్థిక రుణాలు, అప్పుల వాస్తవాలకు సంబంధించి అఫిడవిట్‌లో సరిగా పేర్కొనలేదని పిటిషనర్ వాదించారు. నామినేషన్ పత్రాల పరిశీలనలో అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ 'లోపభూయిష్ట అఫిడవిట్'ను అప్పటి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సక్రమంగా పరిశీలించలేదని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

ఇదిలా ఉంటే.. లోక్‌సభకు ఎన్నికైన తర్వాత ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన పళనిస్వామి.. తన ప్రత్యర్థి వర్గంగా ఉన్న పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించారు. అదే సమయంలో రవీంద్రనాథ్ కూడా పార్టీ నుంచి తొలగించబడ్డారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం