
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కొత్త వివాదానికి తెరలేపారు. ఆయన జన్మదిన వేడుకల్లో దేవాలయ ఆకారంలోని కేక్ కట్ చేసి కొత్త వివాదాన్ని రేపినట్టయింది. ఈ కేక్ కటింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీజేపీ వెంటనే రియాక్ట్ అయింది. ఇది హిందువులను అవమానించడమే అని కమల్ నాథ్ పై విమర్శలు సంధించింది.
కమల్ నాథ్ మూడు రోజులపాటు తన స్వగ్రామ చింద్వారా పర్యటనలో ఉన్నారు. ఆయన బర్త్ డేట్ నవంబర్ 18. అయితే, స్వగ్రామం చింద్వారాలో ఆయన జన్మదినాన్ని ఒక రోజ అడ్వాన్స్‌గానే సెలబ్రేట్ చేయాలని ఆయన అభిమానులు అనుకున్నారు. మంగళవారం సాయంత్రమే ఆయన నివాసంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఇందులో హిందూ దేవాలయ ఆకారంలోని కేక్‌ను తెచ్చారు. కమల్ నాత్ ఈ కేక్ కట్ చేయడం ఇప్పుడు దుమారం రేపుతున్నది.
Also Read: కాంగ్రెస్ ఖుషీ.. మధ్యప్రదేశ్‌లో చౌహాన్ ప్రభుత్వంపై జ్యోతిరాదిత్య సింధియా విధేయుల విమర్శలు
ఈ వీడియో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శలు గుప్పించారు. కమల్ నాథ్, ఆయన పార్టీకి నిజంగా దైవమంటే భక్తి అనేదే లేదని విమర్శలు చేశారు. వారికి దేవుడితో పనే లేదన్నారు. రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన పార్టీకి చెందిన వ్యక్తే కమల్ నాథ్ అని అన్నారు. కానీ, ఇది ఎన్నికల పరంగా వారికి నష్టం చేకూరుతుందని తెలిసిన వెంటనే, ఆయన హనుమాన్ భక్తుడు అయ్యాడు అని ఆరోపణలు చేశారు. వారు హనుమంతుడి ఫొటోను కేక్‌పై పెట్టి.. ఆ కేక్‌ను కట్ చేశాడని అన్నారు. ఇది హిందూ మతానికి, సనాతన ధర్మానానికి అవమానకరం అని ఆరోపణలు చేశారు.