
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జైలు నుంచి విడుదలైన రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి నళిని శ్రీహరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమది కాంగ్రెస్ కుటుంబం అని, రాజీవ్ గాంధీ మరణించినప్పుడు కూడా తాను రోజుల తరబడి ఏడ్చేశానని అన్నారు. తమది కాంగ్రెస్ కుటుంబమే అయినప్పటికీ రాజీవ్ గాంధీ హత్య ఆరోపణలు మోయాల్సి వచ్చిందని వివరించారు.
‘నాది కాంగ్రెస్ కుటుంబం. ఇందిరా గాంధీ మరణించినప్పుడు మేం ఆ రోజు మొత్తం తిననేలేదు. నాలుగు రోజులపాటు మేం ఏడ్చేశాం. రాజీవ్ గాంధీ మరణించినప్పుడు కూడా మేం మూడు రోజులు ఏడ్చాం. కానీ, ఆయన హత్య ఆరోపణలు నేను మోశాను. ఆ ఆరోపణలు వొదిలిగితేనే నాకు ప్రశాంత దక్కుతుంది’ అని వివరించారు. తాను ఈ కేసులో అమాయకురాలినే అని నళిని తెలిపారు. అయితే, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య వెనుక ఉన్నవారు ఎవరూ అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.
‘అలా నేను ఎవరి వైపు వేలెత్తి చూపెట్టలేను. వేరే వారిపై ఆరోపణలు మోపే అలవాటు కూడా లేదు. అదే చేసి ఉంటే నేను 32 ఏళ్లు జైలులో ఉండేదాన్ని కాదు. హత్య వెనుక ఎవరు ఉన్నారో నాకు తెలియదు’ అని నళిని వివరించారు. ఈ సమాధానం విని అక్కడే ఉన్న ఎస్ఐ అనుసూయ ఎర్నెస్ట్ డైసీ అసంతృప్తికి గురయ్యారు. రాజీవ్ హత్యకు జరిగిన పేలుడులో ఆమె అక్కడే ఉన్నారు. ఆమె వేళ్లు మొత్తం కోల్పోయారు. ఈ దాడిలో గాయపడ్డారు కూడా.
‘నళిని సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తాను అమాయకురాలని ఆమె చెప్పదలచుకుంటే సుప్రీంకోర్టు మళ్లీ కేసు ఓపెన్ చేసి రివ్యూ చేసి ఆధేశాలు ఇవ్వాలి. ఈ హత్య వెనుక ఉన్న మరి నిజమైన దోషులు ఎవరనేది కూడా తేలాలి కదా’ అనుసూయా పేర్కొన్నారు.
మురుగన్‌ను నా బిడ్డ దగ్గరికి పంపండి
నళిని శ్రీహర్‌తోపాటు మరో నలుగురు పురుషులు ఈ కేసు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. వారు మన దేశ పౌరులు కాదు. వారిని త్రిచీ స్పెషల్ క్యాంప్‌లో తాత్కాలిక ఆవాసంలో ఉంచారు. మురుగన్, సాంతాను, రాబర్ట్ పాయస్, జయకుమార్‌లు ప్రస్తుతం భారత్ విడిచి వెళ్లాల్సి ఉన్నది. అయితే, వారు ఏ దేశం వెళ్లాలని అనుకుంటున్నారో.. అక్కడికి పంపించే ఏర్పాట్లు చేయాలని తాను కలెక్టర్‌ను కోరినట్టు తెలిపారు.
Also Read: ఉరిశిక్షకు సిద్ధం కావాలని ఏడు సార్లు ఆదేశాలు.. వారు నాకోసం ఎదురుచూశారు కూడా: నళిని
నళిని శ్రీహరన్, మురుగన్‌లకే కూతురు హరిత జన్మించింది. ఆమె విదేశంలో నివసిస్తున్నారు. ఈ సందర్భంగా నళిని కీలక వ్యాఖ్యలు చేశారు. మురుగన్‌ను హరిత నివసించే దేశానికి పంపించాలని తాను కలెక్టర్‌ను కోరినట్టు వివరించారు. సంతాన్ శ్రీలంక వెళ్లాలని అనుకుంటున్నారు. మిగతా ఇద్దరు ఇంకా ఏ దేశం వెళ్లాలో నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.