తల్లి ఫేస్ బుక్ ఫోటో.. కొడుకును జైలు పాలు చేసింది..!

Published : Jun 01, 2022, 03:09 PM IST
తల్లి ఫేస్ బుక్ ఫోటో.. కొడుకును జైలు పాలు చేసింది..!

సారాంశం

ఫేస్ బుక్ లో మహిళ ఫోటో పెడితే.. ఆమె కొడుకును అరెస్టు చేయడం ఏంటి అనే సందేహం మీకు కలగొచ్చు. ఆమె ఫోటో దిగిన ఫోను దొంగిలించినది కావడం అసలు విషయం.

ఓ మహిళ ఫోన్ లో ఫోటో దిగి దానిని ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. అంతే ఆమె చేసిన ఆ పనికి.. పోలీసులు ఆమె కొడుకును అరెస్టు చేసి జైల్లో వేశారు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఫేస్ బుక్ లో మహిళ ఫోటో పెడితే.. ఆమె కొడుకును అరెస్టు చేయడం ఏంటి అనే సందేహం మీకు కలగొచ్చు. ఆమె ఫోటో దిగిన ఫోను దొంగిలించినది కావడం అసలు విషయం.

అసలు మ్యాటర్ లోకి వెళితే... మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందిన సంజయ్ అనే వ్యక్తి.. తన ఫోన్ పోయిందంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  ఇండోర్ సమీపంలోని బానగంగా ప్రాంతంలో తన ఫోన్ పోయినట్లు ఆయన ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ ఎక్కడ ఉందో ట్రేస్  చేశారు.

ఈ క్రమంలో వారి దర్యాప్తులో భాగంగా పోయిన ఫోన్  నుంచి ఫోటో దిగి ఓ మహిళ ఫేస్ బుక్ లో పెట్టినట్లు గుర్తించారు. ఆ మహిళ ఎక్కడ ఉంటుందో పోలీసులు పలువురిని అడిగి ఆరా తీశారు. ఆ తర్వాత.. సదరు మహిళ ఎక్కడ ఉంటుందో కనుగొన్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆ ఫోన్ తన కొడుకు తీసుకు వచ్చినట్లు ఆమె అంగీకరించారు. దీంతో.. దొంగ దొరికాడు. కాగా.. వారి దగ్గర మరో ఇద్దరి ఫోన్లను కూడా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. 

నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. గతంలో మరో మహిళ కూడా ఇలానే చేసి కొడుకును జైలు పాలు చేసింది. 2019, జూలై 12న సాయి​కిరణ్‌ అనే వ్యక్తి గుడికి వెళ్లి, ఇంటికి వచ్చేసరికి అతని ఇంటితలుపులు తెరచి ఉన్నాయి. తాళం వేయడం మర్చిపోయానేమో అనుకుంటు లోపలికి వెళ్లిన ఆ వ్యక్తి తన ఇంట్లో బంగారం పోయినట్టు తెలుసుకున్నాడు. దీంతో ఇంట్లో చోరి జరిగిందని రాచకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంత దర్యాప్తు చేసినా కేసు సాల్వ్ చేయలేకపోయారు. 

ఇక చాలా రోజుల తరువాత వాళ్ల ఇంటి పక్కన ఉండే మహిళ కిరణ్‌ వాళ్ల ఇంట్లో దొంగిలించిన నగను పెట్టుకొని ఉన్న ఫోటోను తన వాట్సాప్‌ స్టేటస్ గా పెట్టుకుంది. చూసిన కిరణ్‌ అది తమ ఇంట్లో పోయిన నగగా గుర్తించి.. ఆ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేయగా ఆమె కొడుకు జితేందర్‌ ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయం అతని తల్లి తెలిసే జరిగిందని పోలీసులు ఆమెకు కూడా నోటీసులు జారిచేశారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం