
Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ విభజన తర్వాత కొంతకాలం శాంతియుత వాతావరణం కొనసాగిన ప్రాంతంలో మళ్లీ మునుపటిలా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శాంతికి భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. జమ్మూకాశ్మీర్ లో కొన్ని సమూహాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన హత్యలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. గత ఐదు నెలల్లో 15 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారని, 18 మంది పౌరులు మరణించారని పేర్కొన్న రాహుల్ గాంధీ.. ఇవేవి పట్టింపులేని బీజేపీ సర్కారు తన ఏనిమిదేండ్ల పాలన వేడుకలలో బిజీగా ఉందని ఆరోపించారు. వాస్తవానికి కాశ్మీరీ పండిట్లు బాధపడుతున్నా వారికి పట్టింపులేదని మండిపడ్డారు.
జమ్మూలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. పండిట్లకు రక్షణ లేకుండా పోయింది. ఇది సినిమా కాదు, ఇది కాశ్మీర్ వాస్తవికత అని రాహుల్ గాంధీ అన్నారు. వివేక్ అగ్నిహోత్రి 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రంపై స్వైప్ చేస్తూ, ప్రధాని నరేంద్ర మోడీతో సహా బీజేపీ నాయకుల నుండి ప్రశంసలు అందుకున్న విషయాన్ని ప్రస్తావించారు. “కశ్మీర్‌లో గత 5 నెలల్లో 15 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. 18 మంది పౌరులు మరణించారు. నిన్న కూడా ఓ టీచర్ హత్యకు గురయ్యాడు. కాశ్మీరీ పండిట్లు 18 రోజుల నుండి ధర్నా చేస్తున్నారు కానీ బీజేపీ 8 సంవత్సరాల సంబరాలలో బిజీగా ఉంది. ప్రధాని గారూ, ఇది సినిమా కాదు, ఈనాటి కాశ్మీర్ వాస్తవికత” అని గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
జమ్మూకాశ్మీర్ లో స్థానికేతరులపై గత కొన్ని వారాలుగా దాడులు జరుగుతున్నాయి. మే 31న జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో రజినీ భల్లా అనే పాఠశాల ఉపాధ్యాయిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. మరో దాడిలో టీవీ ఆర్టిస్ట్ అంబ్రీన్ భట్ కూడా ఉగ్రవాదుల చేతిలో హతమయ్యారు. మే 12న కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్య తర్వాత, వందలాది మంది కాశ్మీరీ పండిట్ ఉద్యోగులు తమ విధులను బహిష్కరిస్తూ కాశ్మీర్ అంతటా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తమను సురక్షిత ప్రదేశాల్లో ఉంచేందుకు వీలుగా జిల్లా కేంద్రాలకు తరలించాలని నిరసనకు దిగిన ఉద్యోగులు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారు. శనివారం, KP ఉద్యోగులు తమ కొనసాగుతున్న సమ్మెను తీవ్రతరం చేయాలని నిర్ణయించుకున్నారు. జమ్మూ మరియు కాశ్మీర్ (J&K) పరిపాలనతో వారి మొదటి సమావేశం ముగిసిన కొన్ని గంటల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, జమ్మూకశ్మీర్‌లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ గ్రూపులతో సంబంధం ఉన్న 26 మంది విదేశీ ఉగ్రవాదులను జనవరి నుంచి కాల్చి చంపారు. మరణించిన మొత్తం ఉగ్రవాదులలో 14 మంది మసూద్ అజార్ స్థాపించిన జైష్‌కు చెందినవారు కాగా, 12 మంది హఫీజ్ మహ్మద్ సయీద్ ఏర్పాటు చేసిన LeTకి అనుబంధంగా ఉన్నారని PTI నివేదించింది.