రాజ్యాంగాన్ని రక్షించడానికి పీఎం మోడీని చంపండి.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. ‘నా ఉద్దేశం.. ’ (వీడియో)

By Mahesh KFirst Published Dec 12, 2022, 1:30 PM IST
Highlights

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాజా పటేరియా చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. రాజ్యాంగాన్ని కాపాడటానికి ప్రధాని మోడీని చంపేయాలని ఆయన వర్కర్లను ఉద్దేశించి మాట్లాడారు. అయితే, ఇక్కడ హత్య అంటే ఎన్నికల్లో ఓడిపోయేలా చేయడం అని వివరించారు.
 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి రాజా పటేరియా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. రాజ్యాంగాన్ని రక్షించడానికి ప్రధాని మోడీని చంపేయాలని ఆయన పేర్కొన్నారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అదే వీడియోలో రాజా పటేరియా తన వ్యాఖ్యలకు వివరణ కూడా ఇచ్చారు. తన ఉద్దేశం పీఎం మోడీని చంపేయాలని కాదని, ఎన్నికల్లో అతడిని ఓడించాలని అని వివరించారు.

కాంగ్రెస్ నేత రాజా పటేరియా మాట్లాడుతున్న వీడియోలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. పార్టీ వర్కర్లను ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ఎన్నికల్లో గెలవడం గురించి, ప్రధానమంత్రి మోడీ గురించి మాట్లాడారు. ‘మోడీ ఎన్నికలను పూర్తిగా రద్దు చేస్తారు. మతం, కులం, భాషా ఆధారాలుగా అతను విభజన చేస్తాడు. దళిత, గిరిజన, మైనార్టీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. ఒక వేళ రాజ్యాంగాన్ని రక్షించాలనుకుంటే మోడీని చంపేయాలి’ అని మాట్లాడారు. అయితే, అదే వీడియోలో ఆయన తాను ఉచ్చరించిన హత్య అనే పదానికి ఓడించడం సరైన అర్థం అని వివరించారు. తాను గాంధీ భావజాలాన్ని విశ్వసిస్తానని, అహింసను నమ్ముతానని పేర్కొన్నారు. మైనార్టీలను కాపాడాలంటే పీఎం మోడీని ఎన్నికల్లో కచ్చితంగా ఓడించి తీరాలని పిలుపు ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వివరించారు.

మధ్యప్రదేశ్‌లో పన్నా జిల్లాలోని పావై టౌన్‌లో కాంగ్రెస్ నేత రాజా పటేరియా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది.

Also Read: "2014కి ముందు కేవలం ధనవంతులు మాత్రమే విమానాల్లో ప్రయాణించేవారు.. కానీ, ఇప్పుడూ..": ప్రతిపక్షాలపై ప్రధాని ఫైర్

ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలు క్షమించరానివి అని అన్నారు. ఆయన ఒక వేళ మానసిక రోగి అని చెప్పినా తాను చేసిన నేరం నుంచి తప్పించుకోలేడని తెలిపారు. వెంటనే రాజా పటేరియాపై యాక్షన్ తీసుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు.

కాగా, మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. కాంగ్రెస్ నేత రాజా పటేరియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ప్రస్తుతం ఉనికిలో ఉన్న కాంగ్రెస్ మహాత్మా గాంధీ భావజాలానికి చెందినది కాదని, ముస్సోలినీ మైండ్‌సెట్‌ను పొందిన ఇటలీ కాంగ్రెస్సే ఈ పార్టీ అని తీవ్రంగా విమర్శించారు.

click me!