మెకాలే విద్యా విధానాన్ని తిరస్కరించాలి - ఉప‌రాష్ట్రప‌తి వెంకయ్య నాయుడు

Published : Mar 19, 2022, 04:50 PM IST
మెకాలే విద్యా విధానాన్ని తిరస్కరించాలి - ఉప‌రాష్ట్రప‌తి వెంకయ్య నాయుడు

సారాంశం

మెకాలే విద్యా విధానాన్ని తిరస్కరించాలని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఈ విద్యా విధానం వల్ల కొంత జనాభాకు మాత్రమే విద్య పరిమితం అయ్యిందని అన్నారు. శనివారం ఆయన ఉత్తరఖాండ్ లోని దేవ్ సంస్కృతి విశ్వ విద్యాలయంలో ప్రసంగించారు. 

ప్రజలు తమ వలసవాద మనస్తత్వాన్ని విడిచిపెట్టి, సొంత గుర్తింపుపై గ‌ర్వ‌ప‌డ‌టం నేర్చుకోవాల‌ని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సూచించారు. స్వాతంత్య్రం వచ్చిన 75వ సంవత్సరాలు అవుతున్న నేప‌థ్యంలో మెకాలే విద్యావిధానాన్ని పూర్తిగా తిరస్కరించాలని పిలుపునిచ్చారు, దేశంలో విద్యా మాధ్యమంగా విదేశీ భాషను విధించి ఉన్నత వర్గాలకే విద్యను పరిమితం చేశారని వెంక‌య్య‌నాయుడు అన్నారు. 

ఉత్త‌రాఖండ్ లోని దేవ్ సంస్కృతి విశ్వ విద్యాలయంలో సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రికన్సిలియేషన్ ప్రారంభించిన త‌రువాత ఉప‌రాష్ట్రప‌తి ప్ర‌సంగించారు. “ శతాబ్దాల వలస పాలన మనల్ని మనం తక్కువ జాతిగా చూసుకోవడం నేర్పింది. మన సొంత సంస్కృతిని, సాంప్రదాయ జ్ఞానాన్ని ధిక్కరించాలని మ‌న‌కు నేర్పించారు. ఇది మ‌న దేశ ఎదుగుద‌ల‌ను మంద‌గించేలా చేసింది. విదేశీ భాషను మ‌న‌ విద్యా మాధ్యమంగా విధించడం వల్ల సమాజంలోని ఒక కొంత‌ వర్గానికి మాత్రమే విద్య పరిమితం అయ్యింది. విస్తారమైన జనాభాకు విద్యా హక్కు లేకుండా పోయింది”  అని అన్నారు. 

“మన వారసత్వం, మన సంస్కృతి, మన పూర్వీకుల గురించి మనం గర్వపడాలి. మనం మన మూలాల్లోకి వెళ్లాలి. మనం మన వలసవాద మనస్తత్వాన్ని విడిచిపెట్టి, మన పిల్లలకు వారి భారతీయ గుర్తింపులో గర్వపడాలని నేర్పించాలి. మనం వీలైనన్ని ఎక్కువ భారతీయ భాషలను నేర్చుకోవాలి. మన మాతృభాషను ప్రేమించాలి. జ్ఞాన నిధి అయిన మన గ్రంథాలను తెలుసుకోవాలంటే మనం సంస్కృతం నేర్చుకోవాలి ” అని ఉపరాష్ట్రపతి అన్నారు.

యువకులను వారి మాతృభాషను ప్రచారం చేయాల‌ని ప్రోత్సహిస్తూ  “ అన్నిగాడ్జెట్ నోటిఫికేషన్‌లు సంబంధిత రాష్ట్ర మాతృభాషలో జారీ చేసే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీ మాతృభాష మీ కంటి చూపు లాంటిది, అయితే మీకు విదేశీ భాషపై ఉన్న జ్ఞానం మీ కళ్ళజోడు లాంటిది. భారతదేశ నూతన విద్యా విధానానికి విద్యా వ్యవస్థ భారతీయీకరణ ప్రధానమైనది. ఇది మాతృభాషల పెంపునకు అధిక ప్రాధాన్యతనిస్తుంది ’’ అని వెంకయ్య నాయుడు తెలిపారు. 

భారత్‌కు వచ్చే విదేశీ ప్రముఖులకు తమ సొంత భాషపై గౌరవం ఉంటుంద‌ని, అందుకే వారు ఇంగ్లీషుకు బదులు తమ మాతృభాషలో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. “ విద్యను కాషాయీకరణ చేస్తున్నామని మాపై ఆరోపణలు ఉన్నాయి. అయితే కాషాయరంగులో తప్పు ఏముంది ? సర్వే భవంతు సుఖినాః (అందరూ సంతోషంగా ఉండండి), వసుదైక‌ కుటుంబం (ప్రపంచం ఒక కుటుంబం) అనేవి మన ప్రాచీన గ్రంథాలలో ఉన్న తత్వాలు, నేటికీ భారతదేశ విదేశాంగ విధానానికి మార్గదర్శక సూత్రాలు” అని ఉపరాష్ట్రపతి అన్నారు.

“ఉమ్మడి మూలాలను కలిగి ఉన్న దాదాపు అన్ని దక్షిణాసియా దేశాలతో భారతదేశం బలమైన సంబంధాలను కలిగి ఉంది. సింధు నాగరికత ఆఫ్ఘనిస్తాన్ నుండి గంగా మైదానాల వరకు విస్తరించింది. ఏ దేశంపైనా ముందుగా దాడి చేయకూడదన్న మ‌న విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తారు. హింస కంటే అహింస, శాంతిని ఎంచుకున్న యోధ రాజు అశోకుడి దేశం ఇది.’’ అని వెంకయ్యనాయుడు అన్నారు. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !