
న్యూఢిల్లీ: భారత్‌లోని ఉక్రెయిన్ అంబాసిడర్ మన దేశ కొన్ని మీడియా సంస్థలపై మండిపడ్డారు. ఆ మీడియా సంస్థులు అందించిన హోలీ బహుమానాన్ని చూసి షాక్ అయ్యానని వివరించారు. క్రిమియాను రష్యా ఆక్రమించుకుని ఎనిమిదేళ్లు గడిచిన సందర్భాన్ని వేడుకగా పేర్కొంటూ వ్యాసాన్ని ప్రచురించిన భారత మీడియా సంస్థలను తప్పుపట్టారు. ఈ వ్యాసాలపై ప్రచురించిన మీడియా సంస్థలకు ఉక్రెయిన్ అంబాసిడర్ ఇగోర్ పొలిఖా లేఖలు రాశారు.
తమకు అందించిన హోలీ ప్రెజెంట్ చూసి షాక్ అవుతున్నామని ఉక్రెయిన్ దౌత్య రాయబారి ఇగోర్ పొలిఖా పేర్కొన్నారు. క్రిమియాను రష్యా దురాక్రమించిన ఎనిమిదేళ్ల వేడుకను స్మరిస్తూ ప్రత్యేకంగా ఒక పేజీని ప్రచురించి ఖంగు తినేలా చేశారని వివరించారు. రష్యా ఆక్రమించిన క్రిమియాను ఇప్పటికీ ఏ దేశం కూడా గుర్తించలేదని, అది మీకు అవగాహన ఉన్నదని భావిస్తున్నట్టు తెలిపారు.
ఈ వ్యాసాన్ని ప్రచురించడానికి బ్లడ్ మనీ ఇచ్చారని ఇగోర్ పొలిఖా పేర్కొన్నారు. ఎందుకంటే.. వారు వ్యాసాన్ని అచ్చు వేశారు గానీ, ఉక్రెయిన్‌లోని నివాసాలపై షెల్లింగ్‌లు, క్షిపణి దాడుల్లో వేలాది మంది ఉక్రెయిన్ పౌరుల మరణాలను ఖాతరు చేయలేదని తెలిపారు. కనీసం 30 లక్షల మంది నిరాశ్రయులైన వైనాన్ని ఆలోచించలేదని విమర్శించారు.
అదే సమయంలో 2014లో మార్చి 27న జరిగిన ఓ పరిణామాన్ని ఆయన గుర్తు చేశారు. ఐరాస జనరల్ అసెంబ్లీ ఉక్రెయిన్ అంతర్జాతీయ సరిహద్దులను పునరుద్ఘాటిస్తూ ఓ తీర్మానం చేసిందని వివరించారు. అంతేకాదు, రష్యా ఆక్రమించిన క్రిమియా, సెవాస్తొపోల్ సిటీని గుర్తించరాదనే విధానాన్ని ఎంచుకున్నదని గుర్తు చేశారు. రష్యా క్రిమియా ఆక్రమణపై వ్యాసాన్ని ప్రచురించిన మీడియా సంస్థలకు రాసిన లేఖలో పై విషయాలను పేర్కొన్నారు.
గతనెల 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తులు చేశారు. ఈ ఉద్రిక్తతలు సమసిపోయేలా సహకరించాలని కోరారు. గత నెల ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ ఘర్షణలను రాజ్‌పుత్‌లపై ముఘల్ చక్రవర్తుల మారణ హోమంగా పోల్చారు.
అంతకుముందు ఆయన కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్‌లో రష్యా దాడులకు గురైన ప్రజలకు సహకారం అందించాలని కోరారు. ఈ విజ్ఞప్తి మేరకు భారత ప్రభుత్వం ఇప్పటి వరకు 90 టన్నుల సప్లైను ఉక్రెయిన్, దాని పొరుగు దేశాలకు పంపింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ మొత్తాన్ని అక్కడకు తరలించింది. అందులో మెడిసిన్స్, ఇతర అత్యావశ్యక సరుకులు ఉన్నాయి. అవసరం బట్టి వచ్చే రోజుల్లోనూ ఈ సహకారాన్ని భారత్ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో అమెరికా, పశ్చిమ దేశాలు.. పుతిన్ దేశంపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల నుంచి ఉపశమనం పొందడానికి రష్యా ప్రభుత్వం దాని మిత్ర దేశాలకు ముడి చమురు, ఇతర సరుకులను భారీ తగ్గింపుతో అమ్ముకోవాలని చూస్తున్నది. కాగా, 80 శాతం ముడి చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే భారత్.. రష్యా చేసిన ఆఫర్‌ను అందిపుచ్చుకోవాలని భావిస్తున్నది. ముఖ్యంగా చౌకగా లభించే ముడి చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకోవాలని యోచిస్తున్నట్టు ఇది వరకే ప్రభుత్వవర్గాలు తెలిపాయి. తాజాగా, భారత్‌లో అతిపెద్ద ఆయిల్ కంపెనీ.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రష్యాతో డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం వచ్చింది. ఇది ప్రభుత్వంతో కాకుండా.. కంపెనీ, కంపెనీకి మధ్యనే ఒప్పందం కుదిరిందని కొందరు చెప్పారు.