ఫేస్ బుక్ లో పోస్ట్... ఇద్దరి ప్రాణాలు తీసింది..!

By telugu teamFirst Published Jun 12, 2019, 7:29 AM IST
Highlights

ఓ యువకుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్... రెండు నిండు ప్రాణాలను బలిగొంది. అంతేకాదు... రెండు కుటుంబాల మధ్య పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.
 

ఓ యువకుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్... రెండు నిండు ప్రాణాలను బలిగొంది. అంతేకాదు... రెండు కుటుంబాల మధ్య పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కడలూరు జిల్లా నైవేలి సమీపంలోని కురవన్ కుప్పంకు చెందిన నీలకంఠం కుమార్తె రాధిక(20) స్థానిక కాలేజీలో పీజీ చదువుతోంది.  ఆమె కాలేజీలో చేరిన నాటి నుంచి  ప్రేమ్ కుమార్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరిట వేధించేవాడు. మొదట్లో పట్టించుకోకపోయినా.... రాను రాను వేధింపులు తీవ్రతరం చేశాడు.

ఫేస్‌ బుక్‌లోనూ వేధించడం మొదలెట్టడంతో తనలోని ఆగ్రహాన్ని రాధిక బయటపెట్టింది. ఫేస్‌బుక్‌ ద్వారానే ప్రేమ్‌కుమార్‌కు చీవాట్లు పెట్టింది. అయితే, ప్రేమ్‌కుమార్‌ మరింత ఆగ్రహానికిలోనై ఎదురుదాడికి దిగాడు. ఈ ఇద్దరి మధ్య తొలుత ఫేస్‌బుక్‌లో పెద్ద సమరమే సాగింది. చివరకు విసిగి వేసారిన రాధిక ఈ వేధింపుల గురించి తల్లిదండ్రుల దృష్టికి తెచ్చింది. దీంతో ప్రేమ్‌కుమార్‌ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ వివాదం అన్నది ఇరు సామాజిక వర్గాల మధ్య సమరం అన్నట్టుగా పరిస్థితి మారింది. ఓ సామాజిక వర్గానికి చెందిన రాజకీయనేతలు, పెద్దల జోక్యంతో ప్రేమ్‌కుమార్‌ను పోలీసులు మందలించి వదలి పెట్టారు.

తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని రాధికపై ప్రేమ్ కుమార్ మరింత పగపెంచుకున్నాడు. ఆమెపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో... రాధికకు విఘ్నేష్‌ అనే  యువకుడితో ప్రేమలో ఉందన్న విషయం ప్రేమ్ కుమార్ తెలుసుకున్నాడు. వారిద్దిరి పెళ్లి జరగకుండా ఉండాలని ప్రేమ్ కుమార్ భావించాడు. ఈ క్రమంలో... రాధిక ఫోటోలను అసభ్యరీతిలో మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. 

వాటిని చూసి పరువు పోయిందని భావించిన రాధిక ఆత్మహత్య చేసుకుంది. రాధిక మృతిని తట్టుకోలేని విఘ్నేష్‌ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా... కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రేమ్ కుమార్ ని అరెస్టు చేశారు. 

ప్రేమ్‌కుమార్‌ పెట్టిన పోస్టింగ్‌ల కారణంగా రాధికా, విఘ్నేష్‌ ఆత్మహత్య చేసుకోవడం ఆ సామాజిక వర్గంలో ఆగ్రహాన్ని రేపింది. రోడ్డెక్కిన ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ప్రేమ్‌కుమార్‌ సామాజిక వర్గానికి చెందిన వారి వాహనాలపై దాడులకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కడలూరు జిల్లా యంత్రాంగం బలగాల్ని రంగంలోకి దించాల్సి వచ్చింది.

click me!