
రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన రాజకీయ స్వార్థపూరిత వైఖరి వల్ల హిందువులే ఎక్కువగా నష్టపోయారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎంఎన్ఎస్ పై గురువారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ మేరకు మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి సచిన్ సావంత్ ట్వీట్ చేశారు. ఎంఎన్ఎస్ రాజకీయ స్వార్థపూరిత వైఖరి, దారి ఉన్మాదం, బీజేపీ మద్దతు ప్రగతిశీల మహారాష్ట్రకు హానికరమని పేర్కొన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలు లౌడ్ స్పీకర్లను ఎందుకు నిషేధించలేదో స్పష్టంగా కనిపిస్తోందని సచిన్ సావంత్ అన్నారు. ‘‘ ఉదయం అజాన్ ను ముస్లింలు నిలిపివేశారు. కానీ దాంతో పాటు కాకాడ్ హారతి (దేవాలయాల్లో తెల్లవారు జామున) కూడా ఆగిపోయింది. చర్చిలు, గురుద్వారాలు, బౌద్ధ దేవాలయాలు ఎలాగూ లౌడ్ స్పీకర్లను ఉపయోగించవు. ఇక బహిరంగ వేడుకల్లో కూడా లౌడ్ స్పీకర్లను అనుమతించరు’’ అని కాంగ్రెస్ నేత ట్వీట్ చేశారు.
ముంబైలో 2,404 దేవాలయాలు, 1,144 మసీదులు ఉన్నాయని సచిన్ సావంత్ తెలిపారు. బుధవారం వరకు వీటిలో 20 దేవాలయాలు, 922 మసీదులకు మాత్రమే అనుమతులు ఉన్నాయని, ఐదు దేవాలయాలు, 15 మసీదుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ‘‘ మనం MNS మాట వింటే మసీదులతో పాటు 2,400 దేవాలయాల్లో కూడా లౌడ్ స్పీకర్లను ఉపయోగించలేము. MNS లౌడ్ స్పీకర్లపై నిలబడటం వల్ల హిందువులు మరింత నష్టపోయారు ’’ అని సావంత్ పేర్కొన్నారు.
బుధవారం ముంబైలోని వివిధ ప్రాంతాల్లో మసీదుల వెలుపల హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్లలో ప్లే చేస్తూ ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే తన ధైర్యాన్ని ప్రదర్శించిన ఒక రోజు తరువాత సావంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. మే ౩ లోగా మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఆయన మహారాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే అల్టిమేటం ఇచ్చారు. లౌడ్ స్పీకర్లు మతానికి సంబంధించినవి కావని చెప్పారు. ఇది ప్రజలందరి సమస్య అని తెలిపారు. తాను చెప్పిన తేదీ వరకు ప్రభుత్వం స్పందించి లౌడ్ స్పీకర్లు తొలగించకపోతే తన పార్టీ ఆధ్వర్యంలో మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా చేస్తామని పలు సందర్భల్లో ఆయన హెచ్చరించారు.
రాజ్ ఠాక్రే చెప్పిన తేదీ తరువాత కూడా మరికొన్ని మసీదుల్లో లౌడ్ స్పీకర్లు ఉండటంతో ఆయన హనుమాన్ చాలీసా పారాయణం వైపే మొగ్గు చూపారు. ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముంబై, నవీ ముంబై ప్రాంతాల్లోని వివిధ మసీదుల వద్ద అజాన్ వినిపించే సమయంలో ఆ పార్టీ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్లలో ప్లే చేశారు. దీంతో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్)కు చెందిన 250 మందికి పైగా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా గత కొంత కాలం నుంచి ఈ లౌడ్ స్పీకర్ల సమస్య దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఇది మహారాష్ట్రలో మొదలైనప్పటికీ దీని ప్రభావం అనేక రాష్ట్రాల్లో కనిపించింది.