
కాంగ్రెస్ పార్టీ ఆఫర్‌ను తిరస్కరించిన ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్.. ఆ తర్వాత చేసిన ట్వీట్ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే వాటన్నింటిపై ప్రశాంత్ కిషోర్ తాజాగా స్పష్టత ఇచ్చారు. బిహార్ రాజధాని పాట్నాలో ప్రశాంత్ కిషోక్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎన్నికల్లో విజయం సాధించాలనే కోరిక లేదని చెప్పారు. తాను బిహార్ అభివృద్దికి కృషి చేయాలని అనుకుంటున్నట్టుగా తెలిపారు. అయితే భావసారూప్యత ఉన్నవారితో కలిసి పనిచేసి రాజకీయ వేదికపై తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
కొత్త రాజకీయ పార్టీ లేదా వేదికను ఇప్పుడే ప్రకటించబోనని తెలిపారు. బిహార్‌లో సానుకూల మార్పు తీసుకురావడానికి రాష్ట్రంలో “నిజమైన మార్పు” తీసుకురావాలనుకునే భావజాలం గల వ్యక్తులతో కలిసి పని చేస్తానని చెప్పారు. “మీడియాలోని ఒక వర్గంలో ఊహాగానాలు జరుగుతున్నట్లుగా.. నేను ప్రస్తుతం ఏ కొత్త పార్టీని ప్రకటించబోవడం లేదు. బీహార్‌లోని సమస్యలపై అవగాహన ఉన్న దాదాపు 17,000 నుంచి18,000 మందితో మాట్లాడి వారిని ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఆగస్టు-సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంది’’ అని పీకే చెప్పారు.
అనుకున్న లక్ష్యాలను సాధించడానికి రాజకీయ వేదిక ప్రారంభించాలని వారు భావిస్తే.. అప్పుడు ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే అది ప్రశాంత్ కిషోర్ పార్టీ కాదని.. ప్రజల పార్టీ అవుతుందని చెప్పుకొచ్చారు. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్‌ల 30 ఏళ్ల పాలన వల్ల బిహార్ దేశంలోనే అత్యంత వెనకబడిన రాష్ట్రంగా నిలిచిందన్నారు. బిహార్ అభివృద్ది చెందాలంటే గతంలో నడిచిన మార్గంలో కాకుండా.. కొత్త దిశ అవసరం ఉందని అన్నారు.
బీహార్ భవిష్యత్తుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని..ఇది ఒక వ్యక్తితో సాధ్యపడదని పీకే చెప్పారు. నిజంగా బీహార్‌లో మార్పు తీసుకురావాలనుకునే ప్రజలు ఏకతాటిపైకి రావాలన్నారు. బీహార్ విద్యా వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు శిథిలావస్థలో ఉన్నాయని.. యువత ఉద్యోగాల కోసం రాష్ట్రం నుంచి తరలివెళ్లాల్సి వస్తుందని.. ఈ పరిస్థితి మారాలని చెప్పారు.
ఇక, రాష్ట్రంలో 3,000 కి.మీ పాదయాత్ర చేయనున్నట్టుగా కూడా పీకే ప్రకటించారు. అక్టోబర్ 2న పశ్చిమ చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నట్టుగా చెప్పారు. అయితే ప్రస్తుతానికి రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ గురించి ప్రస్తావించని పీకే.. భవిష్యత్తులో వాటికి తలపులను మాత్రం తెరిసే ఉంచాడు. దీనిబట్టి చూస్తే తొలుత పాదయాత్ర చేపట్టనున్న పీకే.. ఆ తర్వాత స్పందనను బట్టి తన కార్యచరణను ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.