రాజ్ ఠాక్రే ను అయోధ్య‌లోకి అనుమ‌తించ‌బోము - యూపీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్

Published : May 05, 2022, 03:05 PM IST
రాజ్ ఠాక్రే ను అయోధ్య‌లోకి అనుమ‌తించ‌బోము - యూపీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్

సారాంశం

గతంలో ఉత్తర భారతీయులను ఉద్ధేశించి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు చేశారని యూపీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. వారికి క్షమాపణ చెప్పేంత వరకు రాజ్ ఠాక్రేను అయోధ్యలోకి అనుమతించబోమని అన్నారు. 

ఉత్తర భారతీయులను అవమానించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను అయోధ్యలోకి అనుమతించబోమని ఉత్తరప్రదేశ్ బీజేపీకి చెందిన కైస‌ర్ గంజ్ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పష్టం చేశారు. ఆయ‌న అయోధ్యకు వచ్చే ముందు ఉత్తర భారతీయులందరికీ చేతులు జోడించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఎంపీ శ‌ర‌ణ్ సింగ్ ట్వీట్ చేశారు. 

శ్రీరాముడి దర్శనం కోసం ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే జూన్ 5వ తేదీన అయోధ్య‌ను సందర్శించాల‌ని ప్లాన్ చేసుకున్నారు. ‘‘ జూన్ 5వ తేదీన ఎంఎన్ఎస్ వాలంటీర్లతో కలిసి దర్శనం కోసం అయోధ్యకు వెళ్తాను. ఇతరులు కూడా అయోధ్యకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ఆయ‌న ఇటీవ‌ల పూణేలో మీడియా స‌మావేశంలో తెలిపారు. 

అయోధ్య పర్యటన కు ఎందుకు వెళ్లాల‌ని అనుకుంటున్నార‌ని, దాని వెన‌క ఉద్ధేశం ఏంట‌ని రాజ్ ఠాక్రేను మీడియా అడిగిన‌ప్పుడు ఆయ‌న స‌మాధానమిచ్చారు. తాను చాలా కాలంగా బయటకు వెళ్లలేదని చెప్పారు. ‘‘ రామ మందిరం కోసం చాలా మంది ‘కరసేవకులు’ ప్రాణాలు కోల్పోయారు. సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం కారణంగా అక్కడ రామ మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి నేను దాని నిర్మాణం ప్రారంభ దశలో అక్కడికి వెళ్లాలనుకుంటున్నాను. తరువాత ఆలయం సిద్ధమైన తర్వాత ప్రతీ ఒక్కరూ దానిని మళ్లీ సందర్శిస్తారు’’ అని అన్నారు. 

కాగా రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ ఏర్పాటు చేసిన తొలినాళ్లలో ఉత్తర భారత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, బిహార్ల నుంచి వలస వచ్చిన వారిని వ్య‌తిరేకిస్తూ అనేక అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మహారాష్ట్ర పట్ల విధేయతను కూడా ఆయన ప్రశ్నించారు. మెగాస్టార్ ముంబైలో కీర్తి, ప్రజాదరణ సంపాదించారని, కానీ తన స్వస్థలమైన ఉత్తర ప్రదేశ్ పై ఎక్కువ ఆసక్తి చూపించారని రాజ్ ఠాక్రే విమ‌ర్శించారు. ఉత్తర భారత వలసదారులు చాత్ పూజను నాటకం, అహంకార ప్రదర్శన అని ఆయన అభివర్ణించారు.

ఇటీవ‌ల చ‌ర్చ‌లోకి వ‌చ్చిన లౌడ స్పీక‌ర్ల వివాదానికి కూడా రాజ్ ఠాక్రే కేంద్ర బిందువుగా నిలిచారు. మసీదుల వద్ద ఆజాన్ కోసం ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్ల అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చారు. లౌడ్ స్పీక‌ర్ల‌ను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లౌడ్ స్పీకర్ల సమస్య మతపరమైనది కాదని, అది ప్రజల సమస్య అని థాకరే అన్నారు. ఔరంగాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఆయ‌న ఈ విధంగా వ్యాఖ్య‌లు చేశారు. మే 3వ తేదీ నాటికి లౌడ్ స్పీక‌ర్లను తొల‌గించాల‌ని ప‌లు సంద‌ర్భాల్లో ఆయ‌న డిమాండ్ చేశారు. లేక‌పోతే హిందువులు ఈ ధార్మిక ప్రదేశాల్లో హనుమాన్ చాలీసాను పారాయ‌ణం చేస్తార‌ని తెలిపారు. ఈ లౌడ్ స్పీక‌ర్ల వివాదం ఒక రాష్ఠ్రం నుంచి మ‌రో రాష్ట్రానికి పాకింది. సుప్రీంకోర్టు ఆదేశాల‌తో ఉత్త‌రప్ర‌దేశ్ రాష్ట్రంలో అన్ని మ‌త‌ప‌రమైన ప్ర‌దేశాల్లో లౌడ్ స్పీక‌ర్ల‌ను యూగీ స‌ర్కార్ తొల‌గించే ప‌నిలో ప‌డింది. దాదాపు ఇప్ప‌టి వ‌ర‌కు 11 వేల‌కు పైగా లౌడ్ స్పీక‌ర్ల‌ను తొల‌గించింది. ఇదిలా ఉండ‌గా యూపీలాగే ఢిల్లీలోనూ లౌడ్ స్పీక‌ర్ల‌ను తొల‌గించాల‌ని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు రెండు రోజుల కింద‌ట లేఖ రాశారు.  
 

PREV
click me!

Recommended Stories

భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?
Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?