దేశం విడిచి వెళ్లొద్దు.. లింగాయత్ మఠాధిపతికి లుకౌట్ నోటీసులు

By Rajesh KFirst Published Sep 1, 2022, 5:31 PM IST
Highlights

మైనర్లపై లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కోంటున్న‌లింగాయత్ ప్రధాన పీఠాధిపతి  శివమూర్తి మురుగ శరణారావుపై కర్ణాటక పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

కర్ణాటకలో ప్రముఖ‌ లింగాయత్ మఠాధిపతిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో రాష్ట్రంలో ప్రకంపనలు రేగుతున్నాయి. చిత్రదుర్గలోని ప్ర‌ముఖ లింగాయత్ మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుగ శరణుపై మైనర్లపై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఆయ‌న‌పై పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుల కేసు నమోదయిన విషయం తెలిసిందే.

తాజాగా ఆయ‌న‌పై కర్ణాటక పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి ఎక్కడికీ వెళ్లొద్దని పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యగా నోటీసులు జారీ చేసిన‌ట్టు తెలిపారు. లుక్ అవుట్ నోటీసు అందుకున్న వ్య‌క్తి దేశం విడిచి వెళ్లడం సాధ్యం. అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవుల వంటి అన్ని ఇమ్మిగ్రేషన్ చెక్‌పాయింట్‌లకు మఠాధిపతికి వ్యతిరేకంగా నోటీసు జారీ చేయబడ్డాయి. 

ఆశ్రమంలోని పాఠశాలలో చదువుతున్న‌ ఇద్దరు బాలికలు త‌మపై స్వామీజీ లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపించారు. స్వామీజీ ఆశీర్వాదం పేరుతో తమను పిలిపించిన  లైంగికంగా వేధించారనే బాధిత  బాలికలు ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడున్నరేళ్లుగా త‌మ‌పై స్వామీజీ లైంగిక దాడికి పాల్పడినట్టు  ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్రదుర్గం ఆశ్రమం నుంచి పారిపోయి వచ్చిన బాలికలు స్వచ్చంధ సంస్థ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఆశ్రమ నిర్వాహకులు మాత్రం స్వామీజీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. పోలీసుల విచారణలో నిజానిజాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. కాగా.. ఈ ఘటన కన్న‌డ నాట‌ కలకలం రేపింది.

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా  

అంతకుముందు, మురుగ మఠం నిర్వహిస్తున్న పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో మఠం అధిపతి మహంత్ శివమూర్తి మురుగ శరణారావు ముందస్తు బెయిల్ కు పిటిషన్ దాఖాలు చేశారు. ఈ పిటిష‌న్ పై విచారణను చిత్రదుర్గలోని స్థానిక కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. స్వామిజీ సోమవారం ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. స్వామిజీపై అభియోగాలు దాఖాలు చేసినా వారిలో ఒకరు షెడ్యూల్డ్ కులానికి చెందినవారు. దీంతో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా అదనపు అభియోగాలు మోపారు. దీంతో బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ప‌డింది.

స్వామిజీతో పాటు మఠం హాస్టల్ వార్డెన్‌తో సహా మరో ఐదుగురు వ్యక్తులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. 2019 జనవరి నుంచి 2022 జూన్ వరకు మఠం నిర్వహించే పాఠశాలలో చదువుతున్న, హాస్టల్‌లో ఉంటున్న 15, 16 ఏళ్ల ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించారని ఆరోపించారు. స్వామిజీపై పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టంతోపాటు భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

click me!