కాంగ్రెస్ ఎంపీ బాలు ధనోర్కర్ కన్నుమూత.. తండ్రి మరణించిన మూడు రోజులకే ఘటన.. కుటుంబంలో తీవ్ర విషాదం..

By Sumanth KanukulaFirst Published May 30, 2023, 10:06 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు బాలు  ధనోర్కర్ (సురేశ్ నారాయణ్ ధనోర్కర్) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు బాలు  ధనోర్కర్ (సురేశ్ నారాయణ్ ధనోర్కర్) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దేశ రాజధాని ఢిల్లీలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్ ధ్రువీకరించారు. బాలు ధనోర్కర్.. చంద్రాపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి  ఉన్న ఏకైక లోక్‌సభ సభ్యునిగా ఆయన ఉన్నారు. ఇక, బాలు ధనోర్కర్‌ వయసు 47 ఏళ్లు. ఆయనకు భార్య ప్రతిభ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రతిభ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 

బాలు ధనోర్కర్ మే 26న నాగ్‌పూర్‌లోని ఒక ఆసుపత్రిలో కిడ్నీలో రాళ్లకు చికిత్స పొందారు. కొన్ని సమస్యల తర్వాత ఆదివారం ఢిల్లీలోని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ‘‘కిడ్నీలో రాళ్ల చికిత్స కోసం గత వారం ఆయనను నాగ్‌పూర్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత ఆయనను న్యూఢిల్లీకి తరలించారు. అయితే అతను చికిత్స పొందుతూ ప్రాణాలు  కోల్పోయాడు’’ అని బాలాసాహెబ్ థోరట్ చెప్పారు.

ఇక, ధనోర్కర్ భౌతికకాయాన్ని మంగళవారం మధ్యాహ్నం ఆయన స్వగ్రామం వరోరాకు తరలించనున్నారు. బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే.. బాలు ధనోర్కర్ తండ్రి నారాయణ్ ధనోర్కర్ (80) దీర్ఘకాలిక అనారోగ్యంతో శనివారం సాయంత్రం నాగ్‌పూర్‌లో కన్నుమూశారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతు బాలు ధనోర్కర్ ఆదివారం జరిగిన తన తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. ఇక, తండ్రి తుదిశ్వాస విడిచిన మూడు రోజులకే బాలు ధనోర్కర్ మృతిచెందడం.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 

ఇదిలా ఉంటే, బాలు ధనోర్కర్ మృతిపట్ల కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సంతాపం తెలిపారు. ‘‘మా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సహచరులు సురేశ్ నారాయణ్ ధనోర్కర్ (మహారాష్ట్రలోని చంద్రపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీ) రాత్రిపూట మరణించారని తెలుసుకోవడం బాధాకరం. ఆయనకు 47 ఏళ్లు. ఆయన ప్రియమైన వారికి నా సానుభూతి. ఓం శాంతి’’ అని శశి థరూర్ ట్వీట్ చేశారు.

బాలు ధనోర్కర్ చంద్రపూర్ జిల్లాలో బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. అయినప్పటికీ బీజేపీకి చెందిన హన్స్‌రాజ్ అహిర్ పోటీ చేసిన చంద్రపూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన ఆసక్తిగా కనబరిచారు. ఈ క్రమంలోనే బాలు ధనోర్కర్ కాంగ్రెస్‌లో చేరి చంద్రపూర్ లోక్‌సభ స్థానంలో అహిర్‌ను ఓడించారు. బాలు ధనోర్కర్ భార్య ప్రతిభ.. 2019లో వరోరా-భద్రావతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు.

click me!