కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం: ఈ నెల 10న మోడీ శంకుస్థాపన

By Siva KodatiFirst Published Dec 5, 2020, 9:44 PM IST
Highlights

భారత పార్లమెంట్‌ కొత్త భవనం శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. భవిష్యత్తు అవసరాల కోసం ప్రస్తుత భవనం చాలదన్న ఉద్దేశంతో నిర్మించ తలపెట్టిన ఈ భారీ భవన నిర్మాణ పనులకు డిసెంబర్‌ 10న భూమిపూజ నిర్వహించేందుకు ప్రధానిని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆహ్వానించారు. 

భారత పార్లమెంట్‌ కొత్త భవనం శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. భవిష్యత్తు అవసరాల కోసం ప్రస్తుత భవనం చాలదన్న ఉద్దేశంతో నిర్మించ తలపెట్టిన ఈ భారీ భవన నిర్మాణ పనులకు డిసెంబర్‌ 10న భూమిపూజ నిర్వహించేందుకు ప్రధానిని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆహ్వానించారు.

ఈ మేరకు శనివారం ఆయన మోడీ నివాసానికి వెళ్లి అధికారికంగా ఆహ్వానించారు. అనంతరం ఓం బిర్లా కొత్త భవనానికి సంబంధించిన పలు విషయాలను మీడియాకు వెల్లడించారు.  

ప్రస్తుతం వినియోగంలో వున్న పార్లమెంట్ భవనం సరిపోవడం లేదన్న ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగంతస్తుల్లో భారీ సౌధాన్ని నిర్మించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.

గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్‌, ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ దీని డిజైన్లు రూపొందిస్తుండగా, టాటా ప్రాజెక్ట్ సంస్థ నిర్మాణ పనులు చేపడుతోంది. పనులను 2022 అక్టోబర్‌ నాటికి పూర్తిచేయాలని కేంద్రం సంకల్పించింది.

 

 

ప్రస్తుతం ఉన్న భవనం కంటే 17వేల చదరపు మీటర్ల అదనపు విస్తీర్ణంలో పూర్తి అధునాతన వ్యవస్థలతో నిర్మిస్తున్న ఈ కొత్త భవనం భూకంపాన్ని సైతం తట్టుకొనేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు లోక్‌సభ స్పీకర్‌ వెల్లడించారు.  

ప్రస్తుత పార్లమెంట్ భవనం నిర్మించి వందేళ్లు పూర్తవుతోందని .. స్వతంత్ర భారత్‌లో కొత్త పార్లమెంట్‌ భవనం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఓం బిర్లా చెప్పారు. నూతన భవనంలో భారతీయ శిల్పకళా నైపుణ్యం దర్శనమిస్తుందని వెల్లడించారు.

 

 

రానున్న కాలంలో పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరుగుతుందన్న ఓం బిర్లా... ఆ మేరకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ భారీ నిర్మాణ కార్యక్రమంలో 2వేల మంది ప్రత్యక్షంగా, 9వేల మంది పరోక్షంగా పాల్గొంటారని స్పీకర్ వివరించారు.  

కొత్త పార్లమెంటు సభలో 888 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఉమ్మడి సెషన్లలో 1224 సీట్లకు పెంచే సామర్థ్యం దీనికి ఉందని బిర్లా అన్నారు. ఇది 130 కోట్ల మంది భారతీయుల గర్వించదగిన భవనంగా ఓం బిర్లా వెల్లడించారు.

ఈ బిల్డింగ్ మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.971 కోట్లని, భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ ఏడాది శీతాకాల సమావేశాలను అక్కడ నిర్వహించాలని భావిస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. రాబోయే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ భవంతిని నిర్మిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. 

click me!
Last Updated Dec 5, 2020, 9:48 PM IST
click me!