దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. లోక్ సభ ఎన్నికలు, 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం విడుదల చేశారు. దీంతో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
యావత్ దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. 2024 లోక్ సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నేతృత్వంలోని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించి వెల్లడించింది. ఇందులో సార్వత్రిక ఎన్నికల తేదీలు, దశలు, ఫలితాల వంటి కీలక వివరాలను ప్రకటించారు.
జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు అనే ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించిన రెండు రోజుల తర్వాత 2024 లోక్ సభ ఎన్నికల తేదీని ప్రకటించారు. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లోకి వచ్చిన్నట్టు అయ్యింది. 7 దశల్లో ఎన్నికలు నిర్వహిచనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫలితాలను జూన్ 4న వెల్లడిస్తామని పేర్కొంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ తెలిపారు.
2024 లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి 7 దశల్లో జరగనున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు జూన్ 16 డెడ్లైన్ కంటే ముందే జూన్ 4న ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఈ సారి లోక్ సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.
దేశ వ్యాప్తంగా మొత్తం 7 దశల్లో లోక్ సభ ఎన్నికలు పోలింగ్ జరగనుంది.
మొదటి దశ పోలింగ్ - ఏప్రిల్ 19
రెండో దశ పోలింగ్ - ఏప్రిల్ 26
మూడో దశ పోలింగ్ - మే 7
నాలుగో దశ పోలింగ్ - మే 13
ఐదో దశ పోలింగ్ - మే 20
ఆరో దశ పోలింగ్ - మే 25
ఏడో దశ పోలింగ్ - జూన్ 1
ఫలితాలు - జూన్ 4
తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో మే 13వ తేదీన, ఏప్రిల్ 19వ తేదీన అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్.. (4వ దశలో)
గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ - 18 ఏప్రిల్ 2024 (గురువారం)
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ - 25 ఏప్రిల్ 2024 (గురువారం)
నామినేషన్ల పరిశీలన తేదీ - 26 ఏప్రిల్ 2024 (శుక్రవారం)
నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ - 29 ఏప్రిల్ 2024 (సోమవారం)
పోలింగ్ తేదీ - 13 మే 2024 (సోమవారం)
కౌంటింగ్ తేదీ - 04 జూన్ 2024 (మంగళవారం)
అరుణాచల్ ప్రదేశ్.. (ఒకటో దశలో)
గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ - 20 మార్చి 2024 (బుధవారం)
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ- 27 మార్చి 2024 (బుధవారం)
నామినేషన్ల పరిశీలనకు చివరితేదీ 28 మార్చి 2024 (గురువారం)
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - 30 మార్చి 2024 (శనివారం)
పోలింగ్ తేదీ - 19 ఏప్రిల్ 2024 (శుక్రవారం)
కౌంటింగ్ తేదీ - 04 జూన్ 2024 (మంగళవారం)
సిక్కిం.. (ఒకటో దశలో)
గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ - 20 మార్చి 2024 (బుధవారం)
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ - 27 మార్చి 2024 (బుధవారం)
నామినేషన్ల పరిశీలనకు చివరి తేదీ - 28 మార్చి 2024 (గురువారం)
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - 30 మార్చి 2024 (శనివారం)
పోలింగ్ తేదీ - 19 ఏప్రిల్ 2024 (శుక్రవారం)
కౌంటింగ్ తేదీ- 04 జూన్ 2024 (మంగళవారం)
ఒడిశా..(నాలుగు, ఐదు దశల్లో)
ఒడిశాలో రెండు దశల్లో (4, 5) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో దశలో 28 అసెంబ్లీ స్థానాలకు, ఐదో దశలో 35 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ - 18 ఏప్రిల్ 2024 (గురువారం), 26 ఏప్రిల్ 2024 (శుక్రవారం)
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ - 25 ఏప్రిల్ 2024 (గురువారం), 03 మే 2024 (శుక్రవారం)
నామినేషన్ల పరిశీలన తేదీ - 26 ఏప్రిల్ 2024 (శుక్రవారం), 04 మే 2024 (శనివారం)
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - 29 ఏప్రిల్ 2024 (సోమవారం), 06 మే 2024 (సోమవారం)
పోలింగ్ తేదీ - 13 మే 2024 (సోమవారం), 20 మే 2024 (సోమవారం)
కౌంటింగ్ తేదీ - 04 జూన్ 2024 (మంగళవారం), 04 జూన్ 2024 (మంగళవారం)
కాగా.. ఈ సార్వత్రిక ఎన్నికలతో పాటు దేశంలోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు చేపట్టాలని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల నిర్వహణకు 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు, 1.5 కోట్ల మంది పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బందిని నియమించనున్నారు. ఈ సారి దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. ఇందులో 1.08 కోట్ల మంది కొత్త ఓటర్లను ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల మంది సిబ్బంది పని చేయనున్నారు.