లోక్ సభ ఎన్నికల కోసం మార్చి 14 లేదా 15వ తేదీన షెడ్యూల్డ్ (Lok Sabha Election Schedule) విడుదల అయ్యే అవకాశం ఉంది. మొత్తం 7 దశల్లో నిర్వహించే ఈ ఎన్నికల్లో మొదటి దశ ఏప్రిల్ రెండో వారంలో జరగనున్నాయి.
లోక్ సభ ఎన్నికలు సమీపానికి వచ్చేస్తున్నాయి. ఈ ఎన్నికల కోసం మార్చి 14 లేదా 15న షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. 2019 మాదిరిగానే ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ‘ఏబీపీ న్యూస్’ కథనం పేర్కొంది. ఏప్రిల్ రెండో వారంలో మొదటి దశ పోలింగ్ జరిగేందుకు ఆస్కారం ఉంది. మార్చి 14 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది.
ప్రధాని మోడీ నేతృత్వంలో మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ ఇప్పటికే 195 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బిప్లబ్ కుమార్ దేబ్ లను బరిలోకి దింపింది.
ఇదిలావుండగా.. ఇండియా కూటమి సభ్యులతో సీట్ల పంపకాల చర్చలు జరుగుతున్నాయని, తమ అభ్యర్థులతో ఇంకా చర్చిస్తున్నామని కాంగ్రెస్ పేర్కొంది. సభ్యుల పేర్లపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని తెలిపింది. తమ పార్టీ బీజేపీ మాదిరిగా హడావుడి చేయదని పేర్కొంది.