LK Advani: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఎల్‌కే అడ్వాణీ గైర్హాజరు.. కారణం ఏమిటంటే?

By Mahesh K  |  First Published Jan 22, 2024, 3:56 PM IST

అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఎల్ కే అడ్వాణీ హాజరు కాలేదు. ఉత్తర భారతంలో చలి తీవ్రంగా ఉన్నదని, అందుకే తాను రావడం లేదని అడ్వాణీ కారణం చెప్పినట్టు ఓ కథనం వచ్చింది.
 


Ayodhya Ram Temple: బీజేపీ దిగ్గజ నాయకుడు, మాజీ డిప్యూటీ పీఎం ఎల్‌కే అడ్వాణీ అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాలేదు. ఎల్‌కే అడ్వాణీ బీజేపీలో కీలక నేత. రామ మందిర ఉద్యమాన్ని ప్రారంభించి, ఉధృతం చేసిన నాయకుడు. 1990లో ఆయన రామజన్మభూమి ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ యాత్ర 1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు విధ్వంసంతో ముగిసింది.

ఎల్‌కే అడ్వాణీ, ఆయన కొలీగ్ మురళీ మనోహర్ జోషిలను జనవరి 22వ తేదీన నిర్వహించే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావొద్దని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర తెలిపినట్టు సమాచారం. అయితే, ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఆ ఇద్దరు నేతలను ఆహ్వానించినట్టు పేర్కొంది.

Latest Videos

ఎల్‌కే అడ్వాణీ అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి కచ్చితంగా ఉండాల్సిన నాయకుడు అని బీజేపీలోనూ చాలా మంది భావిస్తారు. అయితే, ఆయన ఈ కార్యక్రమానికి రాలేదు. దీనికి కారణంగా కూడా ఆయనే వెల్లడించారు. ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయని, చలి ఎక్కువగా ఉన్నదని చెబుతూ అడ్వాణీ ఈ కార్యక్రమానికి రావడం లేదని తెలిపారు. ఎల్‌కే అడ్వాణీ వయసు 96 ఏళ్లు.

Also Read: దేవాలయంలోకి రాహుల్ గాంధీ ప్రవేశానికి నిరాకరణ.. రామ రాజ్యం: హిమంత శర్మ కౌంటర్

బీజేపీని 1980లో స్థాపించగా.. 1984లో రామ జన్మభూమి ఉద్యమానికి అడ్వాణీ నాయకత్వ బాధ్యతలు పుచ్చుకున్నారు. 1986 వరకు ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. 1990లో సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్య వరకు అడ్వాణీ రథయాత్రను ప్రారంభించారు. బాబ్రీ మసీదు ఉన్న చోట రామ మందిరం నిర్మించాలనే లక్ష్యంతో ఆ యాత్ర సాగింది.

click me!