
న్యూఢిల్లీ: మన దేశ సమాజంలోనూ సహజీవనానికి(Live in relationship) కొద్ది మొత్తంలో ఆమోదం లభిస్తున్నది. ఈ విధానంపైనా చర్చలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయి.. పెద్దలు అంగీకరించకపోవడం వల్ల దూరంగా కలిసి జీవించే ఘటనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వారికి మళ్లీ తల్లిదండ్రుల నుంచి ముప్పు ఉందని సాధారణంగా పోలీసులను ఆశ్రయిస్తుంటారు. వారి నుంచి భద్రత కోరుతుంటారు. అప్పుడప్పుడు న్యాయస్థానాలనూ ఆశ్రయించి వారి బంధానికి అధికారిక ముద్ర తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి పంజాబ్, హర్యానా హైకోర్టు(High Court) ముందుకు వచ్చింది. ఈ పిటిషనే ఒకటి విచారిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం కొన్ని రోజులు కలిసి ఉన్నంత(Living Together) మాత్రానా వారు సహజీవనంలో ఉన్నారని చెప్పలేం అని పేర్కొంది. కలిసి ఉంటున్న ఇద్దరి మధ్య బంధం.. వారు ఒకరికొకరు బాధ్యతపడి ఉండటం, మేలు చేసుకోవడం వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుందని వివరించింది.
జస్టిస్ మనోజ్ బాజాజ్ ఈ పిటిషన్‌పై వాదనలు వింటూ ఇద్దరు ఆడ, మగ వ్యక్తులు కొంత కాలం కలిసి జీవించి ఉన్నందున వారు సహజీవనంలో ఉన్నారని వాదిస్తే అంగీకరించలేం అని అన్నారు. అవి పేలవమైన వ్యాఖ్యలు అని తెలిపారు. అయితే, వారిద్దురు ఒకరికొకరు విధిగా చేసుకోవాల్సిన కొన్ని బాధ్యతలు, సేవలు ఉంటాయని, వాటి ఆధారంగా వారి మధ్య బంధాన్ని పరిగణించాలని వివరించారు. అలాంటి సందర్భంలోనే వారి మధ్య సంబంధాన్ని పెళ్లితో పోల్చవచ్చునని చెప్పారు. మహిళ కుటుంబం నుంచి తమకు రక్షణ కావాలని హర్యానాలోని యమునా నగర్ జిల్లాకు చెందిన జంట దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంతేకాదు, రూ. 25 వేల జరిమానా విధించింది.
Also Read: టీనేజ్ లోనే సహజీవనం.. మూడేళ్ల తరువాత పోలీస్ ఉద్యోగం.. పెళ్లి చేసుకుందాం అనేసరికి ఫ్లేట్ ఫిరాయించి...
18 ఏళ్ల మహిళ, 20 ఏళ్ల ఆ వ్యక్తి అధికారిక వయసు చేరగానే పెళ్లి చేసుకుంటామని కోర్టుకు తెలిపారు. అయితే, ఆమె తల్లిదండ్రులు వారి ప్రేమను నిరాకరించి మరో వ్యక్తికి పెళ్లి చేయాలని భావించారు. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయి మరో చోట నవంబర్ 24వ తేదీ నుంచి నివసిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు తమపై తప్పుడు కేసులు పెట్టే ప్రమాదం ఉన్నదని, కాబట్టి, తమకు రక్షణ కావాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ అసలు వారు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని, పిటిషనర్ల భయం నిజం కాదనే భావిస్తున్నామని తెలిపింది.
కొన్నేళ్లుగా సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయని, తల్లిదండ్రుల నియంత్రణలో జీవించాలని భావించనివారు తమకు ఇష్టమైన వారిని ఎంచుకుని వారి నుంచి దూరంగా జీవించడానికి సాహసిస్తున్నారని తెలిపింది. ఇదే క్రమంలో వారు కోర్టు నుంచీ ఆమోదం పొందడానికి ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని అభిప్రాయపడింది. నిజానికి వారు కలిసి ఉండాలనే నిర్ణయం చాలా సార్లు హఠాత్తుగా తీసుకున్నవి లేదా.. చాలా కాలంగా రహస్యంగా ఉంచినవిగా ఉంటాయని వివరించింది. భారత్‌లోనూ సహజీవనానికి మెల్లగా ఆమోదం లభిస్తున్నదని, చట్టాల్లోనూ కొద్ది మొత్తంలో వారికి ఆమోదం ఉన్నదని పేర్కొంది.