ఇప్పటివరకు మందుబాబులు మద్యం తాగాలంటే ఏ వైన్స్ కో లేదంటే బార్ కో వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇకపై ఇంటివద్దకే మందు సరఫరా చేసే ప్లాన్ లో కొన్ని రాష్ట్రాలు ప్రణాళికలు రచించారు. ఆ రాష్ట్రాలు ఏవంటే..
న్యూడిల్లీ : ఒకప్పుడు మనకు ఇష్టమైన ఆహార పదార్థాలు తినాలంటే ఒకటి వండుకోవాలి... లేదంటే హోటల్ కి వెళ్లాలి. కానీ టెక్నాలజీ పుణ్యాన మనం ఇంట్లోంచి అడుగు బయటపెట్టకుండానే హోటల్ భోజనాన్ని రుచిచూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇదే ఫార్ములాను మద్యం అమ్మకాల కోసం ఉపయోగించేందుకు కొన్ని రాష్ట్రాలు సిద్దమవుతున్నాయి. ప్రస్తుతం మన ఇంటివద్దకే ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులను అందిస్తున్న ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ కు లిక్కర్ బాధ్యతలు అప్పగించే యోచనలో వున్నట్లు తెలుస్తోంది.
మిగతా వాటికి గిరాకీ వున్నా లేకున్నా భారతదేశంలో మద్యానికి మాత్రం ఎప్పుడూ గిరాకీ వుంటుంది. ఏ మారుమూల వైన్ షాప్ పెట్టినా జనాలు ఎగబడిపోతుంటారు. ఇంత స్కోప్ వున్న ఈ లిక్కర్ బిజినెస్ ను మరోస్థాయికి తీసుకు వెళ్ళేందుకు కొన్ని రాష్ట్రాలు సిద్దమయ్యారు. కేవలం వైన్స్ ద్వారానే కాకుండా ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా మద్యం అమ్మకాలు చేపట్టే ఆలోచనలో వున్నట్లు సమాచారం.
న్యూడిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా మరియు కేరళ రాష్ట్రాలు మద్యాన్ని వినియోగదారుల ఇంటికే చేర్చేందుకు సిద్దమయ్యాయి. స్విగ్గి, జొమాటో, బిగ్ బాస్కెట్, బ్లింకిట్ వంటి ఆన్ లైన్ సంస్థలు ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులను సరఫరా చేస్తున్నాయి. వీటికి లిక్కర్ సరఫరా చేసేందుకు అనుమతి ఇస్తే ఎలా వుంటుందన్నది ఈ రాష్ట్రాల ఆలోచనగా తెలుస్తోంది.
ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా మద్యం అమ్మకాలను చేపట్టడంపై ప్రయోగాత్మకంగా ప్రయత్నిస్తున్నాయి ఈ రాష్ట్రాలు. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఆయా రాష్ట్రాలో పూర్తిస్థాయిలో ఆన్ లైన్ లోనే మద్యం అమ్మకాలు చేపట్టనున్నారు. మొదట తక్కువ ఆల్కహాల్ శాతం వుండే బీర్లు, వైన్ వంటివి అందించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సక్సెస్ అయితే మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ ఆన్ లైన్ లిక్కర్ సప్లయ్ సిస్టమ్ ను ఫాలో అయ్యే అవకాశాలున్నాయి.