టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు కాదు.. ఒక్కసారి పాసైతే జీవితమంతా, కేంద్రం కీలక నిర్ణయం

By Siva KodatiFirst Published Jun 3, 2021, 5:19 PM IST
Highlights

టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్‌ సర్టిఫికేట్‌కు ఏడేళ్ల కాలపరిమితిని ఎత్తివేస్తూ.. అది జీవిత కాలం చెల్లుబాటు అయ్యేలా సవరణలు చేసింది.

టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్‌ సర్టిఫికేట్‌కు ఏడేళ్ల కాలపరిమితిని ఎత్తివేస్తూ.. అది జీవిత కాలం చెల్లుబాటు అయ్యేలా సవరణలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌  పోఖ్రియాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేవారికి టెట్‌ను తప్పనిసరి చేస్తూ గతంలో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ఆదేశాల ప్రకారం.. ఆయా రాష్ట్రాలు టెట్‌ను నిర్వహిస్తున్నాయి. ఒకసారి టెట్‌లో పాసైతే దాని వ్యాలిడిటీ ఏడేళ్లు ఉంటుంది. ఈ లోపల ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధిస్తే సరేసరి, ఏడేళ్లు ముగిసిన తర్వాత ఖచ్చితంగా మళ్లీ టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. 

Also Read:సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు.. విద్యార్ధుల ఆరోగ్యమే ముఖ్యం: మోడీ

అయితే దీనిపై నిపుణులు, మేధావులు, విద్యార్ధుల నుంచి విజ్ఞప్తులు రావడంతో కేంద్రం స్పందించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం జీవితంలో ఒకసారి టెట్‌ పాసైతే, ఉద్యోగం సంపాదించే వరకు దానిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని కేంద్రం భావిస్తోంది. అభ్యర్ధుల ఉద్యోగావకాశాలను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పోఖ్రియాల్‌ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే టెట్‌ అర్హత సాధించి ఏడేళ్లు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా కొత్త ధ్రువపత్రాలు జారీ చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. 2011 నుంచి టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఇది వర్తించనుంది.
 

click me!