చావు.. రెండేళ్లు స్పీడుగా.. కరోనాతో తగ్గిన భారతీయుల ఆయుర్దాయం

By telugu teamFirst Published Oct 23, 2021, 4:35 PM IST
Highlights

కరోనా మహమ్మారి సృష్టించిన విలయంతో దేశంలో లక్షలాది మంది మరణించారు. ఈ మహమ్మారి కారణంగా దేశంలో సగటు వ్యక్తి జీవితం కాలం రెండేళ్లు పడిపోయిందని ముంబయికి చెందిన ఐఐపీఎస్ సంస్థ అంచనా వేసింది. దశాబ్దకాలం క్రితానికి సగటు ఆయుర్దాయం పడిపోయిందని ఐఐపీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పేర్కొన్నారు.
 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయానికి అంతే లేకుండా పోయింది. మనదేశంలో నాలుగు లక్షలకు పైగా ప్రజలు ఈ Coronavirusకి బలైపోయారు. అంతేకాదు, ఈ వైరస్ దీర్ఘకాలికంగానూ Indians జీవితాలపై పెను ప్రభావం వేస్తున్నది. తాజాగా, కరోనా వైరస్ కారణంగా భారతీయుల Life Expectancy రెండేళ్లు క్షీణించినట్టు ముంబయిలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్(ఐఐపీఎస్) ఓ అధ్యయనంలో వెల్లడించింది. 

IIPS అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్యకాంత్ యాదవ్ ప్రకారం.. మహిళలు, పురుషుల జీవితకాలం రెండేళ్లు తగ్గింది. 2019లో మహిళల ఆయుర్దాయం 72ఏళ్లు ఉండగా పురుషుల జీవితకాలం 69.5ఏళ్లుగా ఉన్నది. కానీ, తాజా అంచనాల ప్రకారం, ఈ జీవితకాలం రెండేళ్లు తగ్గిపోయింది. అంటే పురుషుల జీవితకాలం 67.5ఏళ్లు, మహిళల జీవితకాలం 69.8ఏళ్లకు పడిపోయినట్టు ఈ స్టడీ పేర్కొంది.

మరణాల రేటులో మార్పు లేకుంటే.. ఒక మనిషి పుట్టిన తర్వాత ఎన్నేళ్లు జీవించగలడని అంచనా వేసేదే ఈ  ఆయుర్దాయ ప్రమాణం. 145 దేశాల గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ, కొవిడ్ ఇండియా అప్లికేషన్ ప్రొగ్రామ్ ఇంటర్‌ఫేస్ పోర్టల్‌లోని సమాచారం ఆధారంగా ఐఐపీఎస్ ఈ అధ్యయనం చేసింది.

Also Read: పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. ఒక్క రోజే 666 మంది కొవిడ్ పేషెంట్లు మృతి

కరోనా మహమ్మారితో భారత్‌లో అత్యధికంగా పురుషులు మరణించారని, ముఖ్యంగా 35ఏళ్ల నుంచి 69ఏళ్ల మధ్యలోని పురుషులు ఎక్కువగా చనిపోయారని ఈ అధ్యయనం తెలిపింది. ఈ వయసువారిలో అత్యధిక మరణాలు చోటుచేసుకోవడం మూలంగానే భారతీయుల జీవితకాలం తగ్గిందని పేర్కొంది.

గత దశాబ్దకాలంగా సాధించిన అభివృద్ధినంతటినీ మహమ్మారి తుడిచిపెట్టేసిందని అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్యకాంత్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం అంచనా వేసిన ఆయుర్దాయం 2010లో ఉండేదని పేర్కొన్నారు. మళ్లీ సగటు జీవితకాలం పెరగాలంటే కొన్నేళ్ల కాలం పట్టవచ్చని వివరించారు. గతంలోనూ ఇలాంటి మహమ్మారులతో జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని, కానీ, మళ్లీ కొన్నేళ్ల వ్యవధిలోనే జీవితకాలం పుంజుకుందని ఐఐపీఎస్ డైరెక్టర్ డాక్టర్ కేఎస్ జేమ్స్ వెల్లడించారు.

click me!