One Nation One Election: 2029 నాటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ సిఫార్సులు చేయనున్నది. ఇందుకోసం రాజ్యాంగంలో కొత్త చాప్టర్‌ను చేర్చేందుకు లా కమిషన్ ప్రతిపాదనలు చేయనున్నది.
One Nation-One Election: గత కొన్ని రోజులుగా ’ఒకే దేశం - ఒకే ఎన్నిక’ అనే చర్చ జరుగుతోంది. ఈ మేరకు మోడీ సర్కార్ కూడా వేగంగా పావులు కదుపుతోంది. లా కమిషన్ కూడా ఇందుకు తగినట్టు సిఫార్సులు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇందుకోసం రాజ్యాంగంలో కొత్త చాప్టర్‌ను చేర్చేందుకు లా కమిషన్ ప్రతిపాదనలు చేయనున్నది. కానీ, వాటి అమలు మాత్రం .. ఇప్పటికిప్పుడు కుదరకపోవచ్చని , 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి భారీ ఎన్నికలను నిర్వహించాలని లా కమిషన్ సిఫారసు చేసే అవకాశం ఉందట. జస్టిస్ (రిటైర్డ్) రీతు రాజ్ అవస్థి ఆధ్వర్యంలోని కమిషన్.. 19వ లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న 2029 మే-జూన్‌లో మొదటి ఏకకాల ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా వచ్చే ఐదేళ్లలో జమిలి ఎన్నికలకు వీలుగా రాష్ట్రాల అసెంబ్లీ గడువులను మూడు దశల్లో సర్దుబాటు చేయాలని సూచించినట్లు సమాచారం.
రాజ్యాంగంలోని కొత్త అధ్యాయంలో లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, పంచాయతీలు, మునిసిపాలిటీలకు "ఏకకాల ఎన్నికలు" సంబంధించిన అంశాలు చేర్చనున్నది. సిఫార్సు చేయబడిన కొత్త అధ్యాయం రాజ్యాంగంలోని అసెంబ్లీ నిబంధనలతో వ్యవహరించే ఇతర నిబంధనలను భర్తీ చేసే అధికారం కలిగి ఉండేలా లా కమిషన్ సిఫారసు చేసే అవకాశం ఉందట. ఒకవేళ విశ్వాసం కారణంగా ప్రభుత్వాలు పతనమైతే లేదా హంగ్ హౌస్ ఏర్పడితే.. అన్ని రాజకీయ పార్టీలు కలిసి “ఐక్య ప్రభుత్వం” ఏర్పాటు చేసేలా కమిషన్ సిపార్సు చేయనున్నది. ఐక్య ప్రభుత్వ ఫార్ములా పని చేయని పక్షంలో ఎన్నికలు నిర్వహించాలని లా ప్యానెల్ సిఫార్సులు చేయనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.
లా కమిషన్‌తో పాటు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా రాజ్యాంగాన్ని, ప్రస్తుత చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను మార్చడం ద్వారా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, మునిసిపాలిటీలు మరియు పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు ఎలా నిర్వహించవచ్చనే దానిపై నివేదికను రూపొందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలతో పాటు, కనీసం ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.
వచ్చే ఏడాది బీహార్ , ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ 2026లో మరియు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ , మణిపూర్‌లకు 2027లో ఎన్నికలు జరగనున్నాయి. 2028లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ , తెలంగాణ వంటి తొమ్మిది రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చు.