
న్యూఢిల్లీ: కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ ఇప్పుడు పంజరాన చిలక కాదని, భారత టాప్ క్రిమినల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీగా దాని బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నదని వివరించారు. అదే విధంగా గత ప్రభుత్వాలపై ఆరోపణలు సంధించారు. గత ప్రభుత్వాలలో కూర్చున్న కొందరు కొన్ని సార్లు సీబీఐ దర్యాప్తునకు ఒక ఆటంకంగా మారేవారు అని పేర్కొన్నారు. గతంలో కొందరు అధికారులు ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు లేవని అన్నారు.
ఆదివారం ఆయన ఓ ట్వీట్ చేశారు. సీబీఐ ఎంతమాత్రం కూడా పంజరాన చిలకలా లేదని వ్యాఖ్యానించారు. తొలిసారి జరుగుతున్న సీబీఐ అధికారుల సమావేశంలో ఆయన చేసిన ప్రసంగానికి చెందిన కొంత వీడియో క్లిప్‌ను ఆ ట్వీట్‌కు జత చేశారు.
గతంలో సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం నుంచే ఆటంకాలు ఉండేవని, కానీ, ఇప్పుడు అలాంటి వారు లేరని పేర్కొన్నారు. ఎందుకంటే, ఇప్పుడు ప్రధాన మంత్రి స్వయంగా అవినీతిపై పోరు చేసే వ్యక్తి అని వివరించారు.
ప్రభుత్వంలో కూర్చున్న కొందరి ఒత్తిడి కారణంగా సీబీఐ అధికారులపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయించుకున్న సందర్భాలు ఉన్నాయని అన్నారు. 2013లో బొగ్గు గనుల కేటాయింపుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సీబీఐపై మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. అప్పుడు సీబీఐని పంజారన చిలక అంటూ వ్యాఖ్యానించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సీబీఐ కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన తర్వాతే కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ విధంగా మాట్లాడారు. సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యలకు ఇవి సమాధానాలా? అంటూ పలువురు ఆలోచిస్తున్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈ రోజు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ సంస్థ ఇటీవలి కాలంలో దాని చర్యలు, ఉదాసీనతల కారణంగా తరుచూ వార్తల్లో నిలుస్తున్నదని, దాని విశ్వసనీయతపైనా అనేక ప్రశ్నలు వస్తున్నాయని అన్నారు. సీబీఐ నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సీబీఐ ముందు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏమంటే.. అది సోసైటీలో దానిపై గౌరవాన్ని, నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడమేనని వివరించారు. దానికి మొదటి అడుగుగా రాజకీయ నేతలతో సంస్థ సభ్యుల మధ్య వ్యవహారాలను ముగించాలని సూచించారు.
అంతేకాదు, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు అన్నింటిని ఒక అటానమస్ సంస్థ ఏర్పాటు చేసి దాని కిందకు తేవాలని సీజేఐ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ప్రతి సంస్థకు ఒక అటానమస్ పర్సన్ నేతృత్వం వహించడం మంచిదని తెలిపారు. డెమోక్రసీ: రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడారు. సీజేఐ రమణ తన ప్రసంగంలో దేశంలో పోలీసు వ్యవస్థ ఎలా రూపాంతరం చెందుతూ వచ్చిందో ఏకరువు పెట్టారు. బ్రిటీష్ కాలం నుంచి దానిలో వచ్చిన ప్రధాన మార్పులను ఆయన వివరించారు. ఇప్పుడు సీబీఐ అత్యధికంగా ప్రజల దృష్టిలోకి వచ్చిందని, అందరూ సీబీఐని పరీక్షిస్తుంటారని చెప్పారు.
అవినీతి, ఇతర ఆరోపణలతో పోలీసుల ప్రతిష్ట కొంత మసకబారిందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. చాలా మంది పోలీసులు అధికారం మారగానే తమపై వేధింపులు మొదలు అవుతున్నాయని తమను ఆశ్రయించి చెబుతుంటారని వివరించారు. రాజకీయ నేతలు మారుతుంటారు గానీ, మీరు పర్మినెంట్ అంటూ ఆయన ఈ సందర్భంగా అన్నారు.