
అనారోగ్యంతో మరణించిన దిగ్గజ నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ముంబయిలోని శివాజీ పార్క్‌లో అశేష అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు నడుమ అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంత్యక్రియలకు హాజరై లతా మంగేష్కర్‌కు నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ నటులు షారూక్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, సినీరచయిత జావెద్ అక్తర్ తదితరులు హాజరై నివాళులర్పించారు.
మరోవైపు లతా మంగేష్కర్(Lata Mangeshkar) మరణంతో సంగీత ప్రపంచం(Music world)లో శోకసంద్రంలో మునిగింది. ప్రధాని మోడీ(Prime Minister Narendra Modi) సహా రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతాపం(Mourn) ప్రకటించారు. అదే విధంగా ఆమె మరణానికి దేశవ్యాప్తంగా రెండు రోజులు సంతాపం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6వ తేదీ, 7వ తేదీలలో లతా మంగేష్కర్ స్మృతిలో రెండు రోజులు దేశవ్యాప్తంగా సంతాపాన్ని పాటించాలని నిర్ణయం తీసుకుంది. ఆమెకు గౌరవంగా ఈ రెండు రోజుల్లో జాతీయ పతాకాన్ని సగం మేరకే ఎగరేయనున్నారు.
కరోనా బారిన పడటంతో లతా మంగేష్కర్‌ను ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో ఈ నెల 8వ తేదీన చేర్చారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలోనే ఉన్నారు. ఆమె ఆరోగ్యం కొంత మెరుగైంది. కానీ, మళ్లీ క్రమంగా ఆమె ఆరోగ్య దిగజారింది. ఈ రోజు ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు. లతా మంగేష్కర్ భౌతిక దేహాన్ని పెద్దార్ రోడ్డులోని ఆమె నివాసం ప్రభుకుంజ్‌కు తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆమె భౌతిక దేహాన్ని నివాళుల కోసం అక్కడే ఉంచారు. ఆ తర్వాత ముంబయిలోని శివాజీ పార్క్‌కు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో తరలించారు.
తండ్రి మరణంతో 13 ఏళ్లకే సింగర్ గా మారిన లతా మంగేష్కర్... తన మొదటి సాంగ్ మరాఠి చిత్రం కోసం 1942లో పాడారు. అయితే ఈ సాంగ్ ఆ మూవీ ఆల్బంలో పొందుపరచలేదు. అలా మొదలైన ఆమె పాటల ప్రస్థానం దశాబ్దాల పాటు సాగింది. భాషాబేధం లేకుండా వేల కొలది పాటలు పలు చిత్ర పరిశ్రమలకు పాడారు. కెరీర్ లో లతా మంగేష్కర్ పాడినన్ని పాటలు మరో సింగర్ పాడలేదు. ఇది ప్రపంచ రికార్డు కూడాను. ఐదారు తరాల బాలీవుడ్ స్టార్స్ సినిమాలకు లతా మంగేష్కర్ పాడారు.
లతాజీ మరణవార్త తెలిసిన చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థనలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా లతాజీ మరణంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె పాటలను, ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆమె లేని లోటు తీర్చలేనిది అంటూ ఆవేదన చెందుతున్నారు.