మహారాష్ట్రలో విరిగిపడ్డ కొండచరియలు: చిక్కుకున్న 300 మంది

By narsimha lodeFirst Published Jul 23, 2021, 9:45 AM IST
Highlights

మహారాష్ట్రలో కొండ చరియలు విరిగి పడిన ఘటనలో  300 మంది చిక్కుకొన్నారు. ఈ ఘటన రాయ్‌ఘడ్ జిల్లాలోని తలై గ్రామంలో చోటు చేసుకొంది.ఈ ప్రాంతానికి వెళ్లే దారిలో కూడ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సహాయక చర్యలకు ఇబ్బందులు కలుగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.
 

ముంబై :భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలమౌతోంది. రాష్ట్రంలోని రాయ్‌ఘడ్  జిల్లాలో విషాదం చోటు చేసుకొంది.కొంకణ్ రీజియన్‌లో గల  తలై గ్రామంలో కొండచరియలు  విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడడంతో సుమారు 300 మంది శిథిలాలకింద చిక్కుకొన్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు ఇద్దరిని శిథిలాల కింద నుండి వెలికితీశారు.

భారీ వర్షాల కారణంగా ఈ గ్రామానికి వెళ్లే దారులన్నీ కూడ వరదలతో నిండిపోయాయి. దీంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. ఈ గ్రామానికి వెళ్లే దారులన్నీ కొండచరియలు విరిగిపడి మూసుకుపోయాయని కలెక్టర్  నిధి చౌధురి చెప్పారు.ఈ గ్రామం మహద్ తహసీల్ పరిధిలో ఉంది.ఈ ప్రాంతంలోని సావిత్రి నది ఉప్పొంగుతోంది. దీంతో గ్రామానికి చేరుకోవడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికారులు చెప్పారు.

ఈ గ్రామానికి వెళ్లే దారిపై కూడ కొండచరియలు విరిగిపడడంతో ఎన్డీఆర్ఎప్ సిబ్బంది వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని కలెక్టర్ చెప్పారు. స్థానిక పోలీస్ స్టేషన్ కూడ వరద నీటిలో మునిగిపోయిందని చెప్పారు.బాధితులను కాపాడేందుకు ఆర్మీ, నేవీ బృందాలను అధికారులు రంగంలోకి దింపారు ఇవాళ ఉదయం నుండి సహాయక చర్యలను ముమ్మరం చేశారు.


 

click me!