Lakhimpur Kheri violence: లొంగిపోయిన ప్రధాన నిందితుడు అశిష్ మిశ్రా.. లఖింపూర్ జైలుకు తరలింపు..

Published : Apr 24, 2022, 04:35 PM IST
Lakhimpur Kheri violence: లొంగిపోయిన ప్రధాన నిందితుడు అశిష్ మిశ్రా.. లఖింపూర్ జైలుకు తరలింపు..

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూరి కేరీ హింస ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిష్ మిశ్రా లొంగిపోయాడు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆదివారం జ్యూడిషల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట అశిష్ మిశ్రా లొంగిపోయాడు. 

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూరి కేరీ హింస ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిష్ మిశ్రా లొంగిపోయాడు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆదివారం జ్యూడిషల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట అశిష్ మిశ్రా లొంగిపోయాడు. అనంతరం అధికారులు అతడిని లఖింపూర్ జైలుకు తరలించారు.  జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశిష్ మిశ్రా ఆదివారం మధ్యాహ్నం 3.25 గంటలకు లఖింపూర్ ఖేరీ జిల్లా జైలుకు చేరుకున్నారు. అశిష్ మిశ్రాను జైలుకు తరలించిన నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.

ఇక, అశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఈ నెల 18న సుప్రీం కోర్టు రద్దు చేసింది. వారం రోజుల్లోగా లొంగిపోవాలని అశిష్ మిశ్రాను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ఇచ్చిన గడువుకు ఒక్క రోజు ముందుగానే అశిష్ మిశ్రా కోర్టు ఎదుట లొంగిపోయాడు. 

గతేడాది అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ ప్రాంతంలో చెలరేగిన హింసాకాండకు సంబంధించిన కేసులో ఆశిష్ మిశ్రా కీలక నిందితునిగా ఉన్నాడు. ఈ కేసులో అశిష్ మిశ్రాను అక్టోబరు 9న పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో అశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. 

అశిష్ మిశ్రా బెయిల్ ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ లఖింపూర్‌లో చోటుచేసుకున్న హింసలో చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరయ్యాక ఈ కేసులో సాక్షిపై దాడి జరిగిందని ఆరోపిస్తూ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆ పిటిషన్‌పై అన్ని పక్షాల విన్న సుప్రీం ధర్మాసనం.. ఏప్రిల్ 4వ తేదీన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. సోమవారం (ఏప్రిల్ 18) రోజున సుప్రీం ధర్మాసనం.. తన నిర్ణయాన్ని వెలువరించింది. అశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం ధర్మాసనం పక్కన పెట్టింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

‘‘హైకోర్టు తన అధికార పరిధిని మించిపోయింది.. విచారణలో పాల్గొనే హక్కు బాధితులకు నిరాకరించబడింది’’ అని సీజేఐ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ‘‘ఇటువంటి క్రిమినల్ విచారణ ప్రక్రియలో బాధితులకు హద్దులేని భాగస్వామ్య హక్కు ఉంది’’ అని జస్టిస్ సూర్య కాంత్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ పదునైన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు అనేక అసంబద్ధమైన పరిగణనలు, సమస్యలను పరిగణనలోకి తీసుకుందని.. ఎఫ్‌ఐఆర్‌లోని విషయాలకు అధిక ప్రయోజనం కల్పిచిందని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సంబంధిత పరిశీలనలను హైకోర్టు పట్టించుకోలేదని తెలిపింది. ఇక, బెయిల్ దరఖాస్తుపై మూడు నెలల్లో మళ్లీ విచారణ చేపట్టి, న్యాయబద్దంగా నిష్పక్షపాత వైఖరితో వ్యవహరించాలని అలహాబాద్ హైకోర్టుకు సూచించింది. 

ఇక, Lakhimpur Kheri‌లో అక్టోబర్ 3వ తేదీన మూడు వాహనాలతో కూడిన కాన్వాయ్ ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మరణించారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనాల్లో ఒకటి కేంద్ర మంత్రి  Ajay Mishra కుమారుడు  అశిష్ మిశ్రాది. దీంతో ఆగ్రహించిన రైతులు వాహనాలకు నిప్పంటించారు. ఈ క్రమంలోనే ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు. 
 

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People
చెన్నై మెట్రో పనులు పరిశీలించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Reviews Chennai Metro Rail Works