ఏక్‌నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ కోసం అతడు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసాడు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కునాల్ కమ్రా చిక్కుల్లో పడ్డారు. ఇటీవల తన యూట్యూబ్ ఛానల్లో ముఖ్యమంత్రి పదవికోసం శివసేనను చీల్చి బిజెపితో చేతులు కలిపిన ద్రోహి అంటూ ఏక్ నాథ్ షిండే పై కామెంట్స్ చేసారు కునాల్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షిండే వర్గం శివసేన కునాల్ దాడిచేసారు.
ప్రస్తుతం కునాల్ వ్యవహారం మహారాష్ట్రలో దుమారం రేపుతోంది. తమ నాయకుడిని కించపర్చేలా మాట్లాడిన కునాల్ పై కోపోద్రిక్తులైన శివసేన కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేసిన స్టూడియోను ధ్వంసం చేశారు. అంతేకాదు కమ్రాపై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసారు. దీంతో ముంబై పోలీసులు కమ్రాకు రెండు సమన్లు పంపి మార్చి 31లోగా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
తనను అరెస్ట్ చేయడానికే మహారాష్ట్ర పోలీసులు విచారణకు పిలిచినట్లుగా కునాల్ కమ్రా భావిస్తున్నారు. దీంతో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.
కునాల్ కమ్రా తమిళనాడులోని విల్లుపురంలో శాశ్వతంగా నివాసం ఉంటున్నాడు. కాబట్టి వివాదం మహారాష్ట్రలో జరుగుతున్నా అతడు మాత్రం చెన్నై హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు.
తన స్వస్థలం విల్లుపురం అని... కుటుంబమంతా ఇక్కడే ఉంటుందని కునాల్ కమ్రా కోర్టుకు తెలిపాడు. తాను ఇప్పుడు ముంబైకి వెళితే పోలీసులు అరెస్టు చేస్తారని... శివసేన కార్యకర్తల వల్ల ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. కాబట్టి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని... రక్షణ కల్పించేలా చూడాలని ఈ పిటిషన్‌లో కోరాడు.
ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఆయన తరఫు న్యాయవాది చెన్నై హైకోర్టు న్యాయమూర్తి ఎస్.సుందర్ మోహన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ కేసు విచారణ ఈరోజు చెన్నై హైకోర్టులో జరగనుంది.
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. బీజేపీ, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు.
కునాల్ కమ్రా తనపై చేసిన వ్యాఖ్యలపై ఏక్ నాథ్ షిండే కూడా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. చర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. కానీ శివసేన కార్యకర్తలు సంయమనం పాటించాలని... దాడులకు దిగరాదని సూచించారు. చట్టపరంగా అతడిపై చర్యలు ఉంటాయని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం హెచ్చరించారు.