అమ్మో, అవినీతి నిర్మూలన: చేతులెత్తేసిన కుమారస్వామి

First Published Jun 12, 2018, 7:24 AM IST
Highlights

అవినీతి నిర్మూలన విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బెంగళూరు: అవినీతి నిర్మూలన విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రయత్నిస్తే తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించే వ్యవస్థ ఏర్పడిందని ఆయన అన్నారు. 

సమాజంలోంచి అవినీతిని పూర్తి స్థాయిలో నిర్మూలించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి సోమవారం కుమారకృప రోడ్డులోని గాంధీభవన్‌ను సందర్శించారు. గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. 

ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి తమ మఠానికి ఏమీ చేయకపోయినా ఫర్వాలేదని, సమాజంలో అవినీతిని నిర్మూలించాలని శృంగేరి మఠాధిపతి తనకు సూచించారని చెప్పారు. ముల్లును ముల్లుతోనే తీయాలనే రీతిలో పూర్తిస్థాయిలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తానని కుమారస్వామి అన్నారు. 

అయితే తనకు పూర్తి స్థాయి మెజారిటీ లేనందున కఠినమైన నిర్ణయాలు తీసుకోలేనని చెప్పారు. ఎన్ని రోజులు బతుకుతానో తెలియదని, డబ్బు సంపాదించాలనే ఆసక్తి లేదని, మహాత్మాగాంధీ మార్గదర్శకత్వంలో పాలన సాగించి పేద కుటుంబాలకు అండగా నిలుస్తానని చెప్పారు. 

click me!